Urea Shortage : యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కే దుస్థితి వచ్చింది – హరీశ్ రావు
Urea Shortage : రైతుల నిరసనలు, యూరియా కోసం పడుతున్న పాట్లు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గెలిపించిన రైతులు రోడ్ల పై పడిగాపులు కాస్తుంటే..గెలిచినా నేతలు మాత్రం ఏసీ కార్లలో తిరుగుతున్నారని వాపోతున్నారు
- By Sudheer Published Date - 02:15 PM, Wed - 20 August 25

తెలంగాణలో వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో యూరియా (Urea ) కొరత రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. గత బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా అందుబాటులో ఉండేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఒక వీడియోను షేర్ చేస్తూ, గతంలో దర్జాగా బతికిన రైతు, ఇప్పుడు యూరియా కోసం అధికారుల కాళ్ళు మొక్కే దుస్థితి రావడం బాధాకరమని పేర్కొన్నారు.
హరీశ్ రావు తన పోస్ట్‌లో “ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేదనే వాస్తవాన్ని ఈ పాలకులు ఎప్పుడు గుర్తిస్తారు?” అని ప్రశ్నించారు. ఇది కేవలం ఒక రైతు సమస్య కాదని, రాష్ట్రంలో రైతులకు సరైన సహకారం అందకపోవడం వల్ల ఎదురవుతున్న తీవ్రమైన సమస్య అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోవాలని, వారికి అవసరమైన యూరియా, విత్తనాలు మరియు ఇతర సామాగ్రిని సకాలంలో అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
Tomato Prices: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన టమాటా ధరలు..
ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూరియా కొరతపై రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. యూరియా కోసం గంటల తరబడి ఎదురుచూసి విసిగిపోయిన రైతులు రోడ్డుపై ధర్నాకు దిగారు. వారికి యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ, అక్కడికి వచ్చిన పోలీసుల కాళ్లకు మొక్కారు. ఈ హృదయ విదారక దృశ్యం అక్కడి ప్రజలను కలచివేసింది. ఈ ఘటనలు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలకు నిదర్శనంగా నిలిచాయి.
రైతుల నిరసనలు, యూరియా కోసం పడుతున్న పాట్లు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గెలిపించిన రైతులు రోడ్ల పై పడిగాపులు కాస్తుంటే..గెలిచినా నేతలు మాత్రం ఏసీ కార్లలో తిరుగుతున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను త్వరగా పరిష్కరించి రైతులకు అవసరమైన యూరియా సరఫరాను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో, వ్యవసాయ దిగుబడులు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యపై తక్షణమే స్పందించి రైతులకు భరోసా ఇవ్వాలని కోరుతున్నారు.
పదేళ్ల @BRSparty పాలనలో దర్జాగా బతికిన రైతన్నకు..
కాంగ్రెస్ దుర్మార్గ పాలనలో యూరియా కోసం అధికారుల కాళ్ళు మొక్కే దుస్థితి రావడం అత్యంత బాధాకరం.
‘ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేద’ నే వాస్తవాన్ని ఈ పాలకులు ఎప్పుడు గుర్తిసారు. ఇంకెప్పుడు రైతన్న యూరియా కష్టాలు… pic.twitter.com/HfECV0j1Uz
— Harish Rao Thanneeru (@BRSHarish) August 20, 2025