Rythu Panduga : పాలమూరుకు ఏం చేసావని కేసీఆర్‌ను ప్రశ్నించే హక్కు మీకెక్కడిది – హరీష్ రావు
Rythu Panduga : రేవంత్ రెడ్డి ప్రసంగం చూస్తే రైతుల పట్ల ప్రేమ కంటే, గిరిజనుల నుంచి భూసేకరణ చేయడంలో ఘోరంగా విఫలమయ్యామనే ఆవేదనే కనిపించింది
- By Sudheer Published Date - 10:07 PM, Sat - 30 November 24

పాలమూరు జిల్లాపై బిఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తూ, కపట ప్రేమ చూపిస్తున్నారని..’నేను ఇక్కడ పుట్టినోడ్ని. పోతే ఈ మట్టిలో కలిసేటోడ్ని. సీఎంగా ఉండి నా జిల్లాకు ఏమీ చేసుకోకపోతే, నిధులు, నీళ్లు ఇవ్వకపోతే చరిత్ర నన్ను క్షమిస్తుందా? ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంటూ జిల్లాకు నిధులు తెస్తా. నీళ్లు పారిస్తా..గతంలో వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని కేసీఆర్ అంటే, ఇప్పుడు తాము వరి పండిస్తే క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నామని ..ఇది చూసి బిఆర్ఎస్ నేతల గుండెల్లో పిడుగులు పడుతున్నాయి..పదేళ్లు అధికారంలో ఉండి, పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే లక్ష కోట్లు ఖర్చు చేస్తే, ఆ ప్రాజెక్టు కుప్పకూలిపోయిందని .. మహబూబ్‌నగర్ ప్రాజెక్టులకు నిధులు ఇచ్చేందుకు కేసీఆర్‌కు మనసొప్పలేదని .. ఎవరెవరో వచ్చి మన జిల్లాను దత్తత తీసుకుంటామని అన్నారని వాళ్లు ఏం చేశారని అంటూ మహబూబ్‌నగర్‌లో రైతు పండుగ (Rythu Panduga) ముగింపు వేడుక లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేసారు.
ఈ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేత , మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు.పాలమూరుకు ఏం చేసావని కేసీఆర్‌ను ప్రశ్నించే హక్కు మీకెక్కడిది అని నిలదీశారు. రేవంత్ రెడ్డి ప్రసంగం చూస్తే రైతుల పట్ల ప్రేమ కంటే, గిరిజనుల నుంచి భూసేకరణ చేయడంలో ఘోరంగా విఫలమయ్యామనే ఆవేదనే కనిపించింది. అభివృద్ధి జరగాలంటే రైతులు నష్టపోవాలని చెబుతున్నవు. పాలమూరు సభ సాక్షిగా ఏ రైతులను బెదిరిస్తున్నావు. పాలమూరు బిడ్డగా ఇది నీకు న్యాయమా? రేవంత్ రెడ్డి. ఒకసారి ఫార్మాసిటీ అని గెజిట్ ఇచ్చి, బీఆర్ఎస్ పోరాటంతో వెనక్కి తగ్గి ఇప్పుడు పారిశ్రామిక కారిడార్ అని ప్రచారం చేస్తున్నావు. ఎటు వాటమైతే అటు మాట్లాడటం నీకే చెల్లింది. మాకొద్దు ఫార్మాసిటీ అంటూ లగచర్లలో లడాయి చేసిన గిరిజన బిడ్డలను అరెస్టులు చేసి జైలుకు పంపించావు. ఇప్పుడేమో సొంత జిల్లా ప్రజల మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు మొసలి కన్నీరు కార్చుతున్నావు. రుణమాఫీ చేస్తానని నూటొక్క దేవుళ్ల మీద ఒట్టేసి మాట తప్పావు. ఇప్పుడు నీ మంత్రుల సాక్షిగా ఒట్టు వేసి పాలమూరు అభివృద్ధికి మాటిచ్చావు. రుణమాఫీ లెక్కనే పాలమూరు అభివృద్ధి హామీ ఉంటదేమో అని హరీశ్‌రావు సెటైర్లు వేశారు.
పాలమూరుకు ఏం చేసావని కేసీఆర్‌ను ప్రశ్నించే హక్కు మీకెక్కడిది..? కాంగ్రెస్ పాలనలో వలసలకు, ఆకలి చావులకు నిలయంగా మారిన పాలమూరు తలరాతను మార్చింది కేసీఆర్, వలసలను వాపస్ తెచ్చింది కేసీఆర్. మీ పాలనలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది కేసీఆర్. కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల్లో 2014 వరకు కేవలం 27 వేల ఎకరాలు సాగైతే, దాన్ని ఆరున్నర లక్షల ఎకరాలకు పెంచింది కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించి 90 శాతం పూర్తి చేస్తే, ఏడాది పాలనలో మీరు మిగిలిన చివరి పనులు కూడా పూర్తి చెయ్యక చోద్యం చూస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు.
Read Also : Fengal Cyclone : తీరాన్ని తాకిన “ఫెంగల్” తుపాను..భారీ నుంచి అతి భారీ వర్షాలు