Gutta Sukender Reddy: గుత్తా మంత్రి పదవి ఆశలు గల్లంతు..!
- Author : HashtagU Desk
Date : 14-03-2022 - 4:45 IST
Published By : Hashtagu Telugu Desk
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి వరుసగా రెండోసారి తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన మండలి ఎన్నికకు ఒకే ఒక్క నామినేషన్ రావడంతో గుత్తా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నిక అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డిని చైర్మన్ సీటు వద్దకు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు ఎమ్మెల్సీలు తీసుకెళ్లారు. చైర్మన్ సీటులో ఆశీనులైన గుత్తాకు మంత్రులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఇక తెలంగాణలో సీనియర్ నేతల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి ఒకరు. రాష్ట్రంలో ఒక్కసారైనా మంత్రి కావాలనేది గుత్తా సుఖేందర్ రెడ్డి కోరిక. ఈ క్రమంలో గతంలో ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. టీఆర్ఎస్ సర్కారు వచ్చాక ఇప్పటికే ఒక సారి మండలి ఛైర్మన్ పదవి చేపట్టారు. ఆ తర్వాత ఆయన్ను మరోసారి ఎమ్మెల్సీని చేసి మంత్రి చేస్తారని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరిగింది. మరోసారి ఆయన తాజాగా శాసనమండలికి ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక అవడంతో ఈ సారి కూడా ఆయన మంత్రి పదవి ఆశలు గల్లంతు అయ్యాయని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.
2019 సెప్టెంబర్ 11న తొలిసారిగా మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా.. 2021 జూన్ మొదటి వారం వరకు ఆయన మండలి చైర్మన్‌గా సేవలందించారు. ఆతర్వాత శాసనమండలికి 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నవంబర్ 22న రెండోసారి ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి, ఈరోజు రెండోసారి మండలి చైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇకపోతే నల్లగొండ జిల్లా ఊరుమడ్ల గ్రామంలో 1954 ఫిబ్రవరి 2న జన్మించిన గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఇక తన రాజకీయ ప్రస్థానాన్ని కమ్యూనిస్టు పార్టీ నుంచి ప్రారంభించిన గుత్తా, కమ్యూనిస్టు పార్టీలో చురుకుగా పని చేసిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు.
ఆ తర్వాత టీడీపీ పార్టీలో చేరిన గుత్తా, 2004 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు. ఆపై కాంగ్రెస్ పార్టీల్లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నల్లగొండ నియోజకవర్గం నుంచే మళ్లీ ఎంపీగాఎంపికయ్యారు. 2014 ఎలక్షన్స్‌లోనూ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2016 జూన్ 15న టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో గుత్తాను రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ నియమించారు.ఆ తర్వాత 2019 ఆగస్టులో ఎమ్మెల్యే కోటాలో తొలిసారిగా శాసనమండలికి ఎన్నికయ్యారు. 2019 సెప్టెంబర్ 11న మండలి చైర్మన్‌గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. 2021 జూన్ 3న గుత్తా పదవీకాలం ముగిసింది. 2021 నవంబర్‌లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నిక అయిన గుత్తా సుకేందర్ రెడ్డి ఈరోజు ఆ బాధ్యతలు స్వీకరించారు.