UPI – Ticket Counters : ఇక రైల్వే టికెట్ కౌంటర్లలోనూ డిజిటల్ పేమెంట్స్
UPI - Ticket Counters : రైల్వే టికెట్ కౌంటర్ల నుంచి టికెట్లను కొనేందుకు ఇప్పటిదాకా మనం క్యాష్‌ను మాత్రమే ఇస్తున్నాం.
- By Pasha Published Date - 02:46 PM, Wed - 7 February 24

UPI – Ticket Counters : రైల్వే టికెట్ కౌంటర్ల నుంచి టికెట్లను కొనేందుకు ఇప్పటిదాకా మనం క్యాష్‌ను మాత్రమే ఇస్తున్నాం. ఇకపై మనం యూపీఐ తరహా డిజిటల్ పేమెంట్స్ కూడా చేయొచ్చు. రైలు ప్రయాణికుల కోసం ఈ సౌకర్యాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. టికెటుకు సరిపడా చిల్లర కోసం ప్రయాణికులు పడుతున్న కష్టాలతో పాటు టికెట్ కౌంటర్‌లో ఉండే రైల్వే సిబ్బంది పడుతున్న బాధలను అర్థం చేసుకుని రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రైల్వే టికెట్ కౌంటర్లలో డిజిటల్ పేమెంట్స్ వసతి అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇకపై మనం టికెట్ కొనేందుకు చిల్లర కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. రైల్వే టికెట్ కౌంటర్లలో డెబిట్, క్రెడిట్ కార్డులతోనూ చెల్లింపులు చేయొచ్చు. ఈ నిర్ణయం ఎంతోమంది ప్రయాణికులకు ఊరట కలిగించనుంది. కౌంటర్లలో(UPI – Ticket Counters) టికెట్ల జారీకి పట్టే సమయాన్నికూడా తగ్గించనుంది.
We’re now on WhatsApp. Click to Join
రైలు టికెట్ల బుకింగే కొంచెం కష్టమే. ముందస్తు ప్లాన్‌తో రైలు టికెట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అవగాహన ఉన్న వాళ్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటారు. అవగాహన లేని వాళ్లు.. రైల్వేస్టేషన్లలో టికెట్ కౌంటర్ల దగ్గరకు వెళ్లి.. టికెట్ రిజర్వ్ చేయించుకుంటారు. ఇలాంటి టైంలో టికెట్‌కు సరిపడా చిల్లర లేక ప్రయాణికులు ఎంతో ఇబ్బందిపడుతుంటారు. ఇకపై అలాంటి సమస్యలు ఉండవు. ఎందుకంటే టికెట్ కౌంటర్ల వద్ద క్యూఆర్ కోడ్‌ను స్కాన్ వసతి ఉంటుంది. చక్కగా యూపీఐ యాప్ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డులతోనూ చెల్లింపులు చేయొచ్చు.
Also Read : WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. అదేంటంటే..?
ఇందుకోసం ఇప్పటికే అన్ని రైల్వే స్టేషన్లలో 466 పీఓఎస్ మిషన్లు, యూపీఐ క్యూఆర్ కోడ్‌లను అమర్చినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని దాదాపు అన్ని రైల్వే స్టేషన్లలో ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్, అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్ కౌంటర్లలో ఈ మిషన్లను అమర్చామన్నారు. దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయంపై రైలు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనరల్ టికెట్ కూడా డిజిటల్ పేమెంట్ ద్వారా కొనుక్కోవచ్చని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ చెబుతున్న డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని నెరవేర్చడంలో చాలా ఆలస్యం జరిగిందని.. కనీసం ఇప్పటికైనా ఈ వసతిని అందుబాటులోకి తేవడం మంచి పరిణామమనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.