Telangana Rising Global Summit : ప్రపంచ దృష్టిని ఆకర్షించబోతున్న గ్లోబల్ సమ్మిట్
Telangana Rising Global Summit : 2047నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యంగా సమ్మిట్ నిర్వహించనున్నారు
- By Sudheer Published Date - 09:14 AM, Sat - 6 December 25
దేశ వ్యాప్తంగానే కాదు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ గురించి మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తేవడం , రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకరావడం , 2047నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యంగా సమ్మిట్ నిర్వహించనున్నారు.మొత్తం 1,686 మంది ప్రతినిధులు, 42 దేశాల నుంచి 255 మంది అంతర్జాతీయ డెలిగేట్లు హాజరు కానున్నారు. సమ్మిట్‌లో మొత్తం 26 ప్రత్యేక సెషన్లు ఉంటాయి టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఎనర్జీ, ఆర్థిక అభివృద్ధి వంటి 15 ప్రధాన రంగాల్లో చర్చలు జరుగుతాయి. 75 మంది ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటారు .198 మంది టెక్నాలజీ రంగ ప్రతినిధులు, 66 మంది హెల్త్‌కేర్ ఫార్మా ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని మీర్‌ఖాన్‌పేట-ముచ్చర్ల పరిధిలో దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో, భారీ అంచనాలతో ఈ ఫ్యూచర్‌సిటీని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల తరువాత, ఐటీ రంగం రాకతో ఏర్పడిన సైబరాబాద్ తరహాలోనే, నాలుగో నగరంగా ఈ ఫ్యూచర్‌సిటీని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగేందుకు వీలుగా ప్రత్యేకంగా ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని (FCDA) కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Nail Rubbing: మీకు ఈ అలవాటు ఉందా? రోజుకు 5 నిమిషాలు ఇలా చేస్తే చాలు!!
ఈ భావినగరంలో అత్యాధునిక మౌలిక వసతులు మరియు సంస్థాగత కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవనాలు నిర్మాణంలో ఉండగా, త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విశ్వవిద్యాలయం రానుంది. వీటితో పాటు పరిశోధన, ఇంక్యుబేషన్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫ్యూచర్‌సిటీని కేవలం విద్యా కేంద్రంగానే కాకుండా, ఆర్థికాభివృద్ధి కేంద్రంగా కూడా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో పారిశ్రామిక పార్కులు, ఐటీ, ఫార్మా సంస్థలు, గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల కార్యకలాపాలు ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. అంతేకాకుండా, ప్రజల వారాంతపు వినోదం కోసం గేమింగ్ జోన్లు, వినోద కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈ రకమైన సమగ్ర అభివృద్ధి ఈ ఫ్యూచర్‌సిటీని తెలంగాణ యొక్క భవిష్యత్తు ఆర్థిక శక్తిగా మారుస్తుందని ఆశించవచ్చు.
ఫ్యూచర్‌సిటీ స్థానం మరియు కనెక్టివిటీ కూడా దీని ప్రాముఖ్యతను పెంచుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ 56 గ్రామాలు, 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వెంట రావిర్యాల మీదుగా ఈ నగరానికి సుమారు 40 కి.మీ. దూరం ఉంటుంది. రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడానికి కొత్తగా 41 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ రహదారిని నిర్మిస్తున్నారు. అదేవిధంగా, శ్రీశైలం జాతీయ రహదారి మార్గంలో తుక్కుగూడ నుంచి కేవలం 20 కి.మీ. దూరంలోనే ఈ ఫ్యూచర్‌సిటీ ఉంది. గ్లోబల్ సమిట్ వేదిక విమానాశ్రయం నుంచి కేవలం 33 కి.మీ. దూరంలో ఉండడం వల్ల, దేశ విదేశాల నుంచి వచ్చే అత్యున్నత స్థాయి ప్రతినిధులకు ప్రయాణ సౌలభ్యం ఉంటుంది. మెరుగైన కనెక్టివిటీ ఈ నగరానికి పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకంగా సహాయపడుతుంది.