Adani Group : 1000 పడకలతో అదానీ 2 హాస్పిటల్స్ ..ఎక్కడంటే..!!
Adani Group : ఈ సంస్థ ముంబై, అహ్మదాబాద్ నగరాల్లో రెండు భారీ ఆసుపత్రులను నిర్మించాలని నిర్ణయించింది
- By Sudheer Published Date - 09:25 PM, Mon - 10 February 25

దేశంలో వైద్య సేవలను మెరుగుపరిచే దిశగా అదానీ గ్రూప్ (Adani Group) మరో కీలక ముందడుగు వేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani ) నేతృత్వంలోని ఈ సంస్థ ముంబై, అహ్మదాబాద్ నగరాల్లో రెండు భారీ ఆసుపత్రులను నిర్మించాలని నిర్ణయించింది. ప్రతీ ఆసుపత్రిలో 1000 పడకల సౌకర్యాన్ని కల్పించనుండగా, అమెరికాకు చెందిన మెడికల్ రీసెర్చ్ సంస్థ మాయో క్లినిక్ తో కలిసి ఈ ప్రాజెక్టును అమలు చేయనుంది.
ఈ రెండు ఆసుపత్రుల నిర్మాణం కోసం అదానీ గ్రూప్ దాదాపు రూ.6 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించడమే కాకుండా, మెడికల్ విద్య, పరిశోధనను ప్రోత్సహించేందుకు కూడా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. ఆసుపత్రుల నిర్మాణంతో పాటు, ఆధునిక వైద్య పరికరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, బయో మెడికల్ ఇన్ఫర్మేటిక్స్ తదితర సదుపాయాలను అందించనున్నట్లు సంస్థ పేర్కొంది. అదానీ గ్రూప్ దీని ద్వారా భారతదేశ వైద్య రంగంలో విశేషమైన మార్పులను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని హెల్త్ సిటీలను అభివృద్ధి చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ వివాహం సందర్భంగా ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్య అభివృద్ధి రంగాల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.10 వేల కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఈ విరాళంలో భాగంగా మొదటిగా ఈ రెండు మెడికల్ క్యాంపస్‌లు నిర్మించాలని నిర్ణయించారు. ఇవి పూర్తయిన తరువాత, అదానీ గ్రూప్ మరిన్ని నగరాల్లో వైద్య సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.