Telanganas OffTrack : అధికారం కోసం కుస్తీ.. నిశ్శబ్ద తిరుగుబాట్లు, తిరుగుబాటు డ్రామాలు, మంత్రివర్గంలో రచ్చ
తెలంగాణలో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ(Telanganas Power Struggles) అనేది అంతులేని కసరత్తుగా మారింది.
- By Dinesh Akula Published Date - 07:06 PM, Mon - 10 February 25

కవిత రాజకీయ క్రీడ : ఒంటరిగా పోరాడుతోందా ? బీఆర్‌ఎస్‌లో నిశ్శబ్ద తిరుగుబాటు మొదలైందా?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయింది. ఇప్పుడామె తెలంగాణలోని బీసీ వర్గాల హక్కుల కోసం గళమెత్తుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్‌లో సైలెంట్‌గా ఉండిపోయిన కవిత.. ఇప్పుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా జనంతో మమేకం అవుతున్నారు. అయితే పార్టీ నుంచి కవితకు మద్దతు లభిస్తుందా ? లేక కవిత రాజకీయంగా మరింత ఒంటరిగా మారుతుందా ? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
బీసీ హక్కులు.. అందరి కంటే ముందు కవితే
కొందరు అనుకుంటున్నట్లుగా బీసీ హక్కుల అంశాన్ని తొలుత కాంగ్రెస్ పార్టీయో, బీజేపీయో లేవనెత్తలేదు. 2024 జనవరిలో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత, బీసీ హక్కులపై తొలిసారిగా గళమెత్తింది కల్వకుంట్ల కవితే. ఆ సమయంలో అధికార కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు బీసీల హక్కుల గురించి పెద్దగా మాట్లాడలేదు. కానీ రాజకీయ నిశ్చయత, వ్యూహాత్మక ఆలోచనతో బీసీల గురించి కవిత బలంగా మాట్లాడారు. బీసీ సంక్షేమం కోసం పాతికేళ్లుగా పోరాడుతున్న యునైటెడ్ ఫూలే ఫ్రంట్‌ను సమర్థించిందీ కవితే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈక్రమంలో తన సొంత పార్టీ(బీఆర్ఎస్) నుంచి కవితకు ఎన్నడూ మద్దతు రాలేదు. బీఆర్‌ఎస్‌లోని శక్తివంతమైన నేతలు కవిత ప్రజాదరణను అంగీకరించినా, ఆమె రాజకీయ ప్రాభవాన్ని పెంచేందుకు చేదోడును అందించలేదు.
కవిత పోరాటం.. పరమార్ధం
కవిత చేస్తున్నది కేవలం బీసీ హక్కుల పోరాటం కాదు. బీఆర్‌ఎస్‌లో తన స్థానాన్ని ఆమె ఎంత బలంగా నిలబెట్టుకోగలదు అనేది నిర్ణయించే అంశం కూడా ఇదే. బీఆర్ఎస్‌లో అత్యంత ప్రసిద్ధ మహిళా నాయకురాలు కవితే. కానీ ఆశ్చర్యకరంగా బీఆర్‌ఎస్ ఇప్పటి వరకు మహిళల విభాగాన్ని ఏర్పాటు చేయనేలేదు. బీఆర్ఎస్‌లోని అగ్ర నాయకులు మరో శక్తికేంద్రం రావడం అనవసరమని భావిస్తున్నారా? పార్టీలోని ప్రస్తుత సమీకరణాలను మార్చే సామర్థ్యం కలిగిన కవితకు కీలక స్థానం ఇవ్వడానికి కొందరు అగ్రజులు ఇష్టపడటం లేదా ? అనే కోణాల్లో పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
ఒకే ఒక్క వ్యక్తి చుట్టూ బీఆర్‌ఎస్ ప్రదక్షిణలు
తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటి నుంచి బీఆర్‌ఎస్ మొత్తం ఒకే ఒక్క వ్యక్తి (కేటీఆర్) చుట్టూ తిరుగుతోంది. ఈ పరిస్థితిలో కవితకు రాజకీయంగా తనదైన స్థానం ఏర్పర్చుకోవడానికి తగిన అవకాశాలు లభించడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ పొందిన తర్వాత, కొన్ని నెలల పాటు కవిత రాజకీయాల నుంచి దూరంగా ఉండిపోయారు. అయితే ఎప్పటికైనా ఆమె యాక్టివేట్ అవుతారని రాజకీయ విశ్లేషకులు ముందే ఊహించారు. ఇప్పుడు, కవిత తిరిగి వచ్చింది, అది మామూలుగా కాదు. తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన బీసీ అంశంపై బలమైన వాణితో ఆమె తెరపైకి వచ్చారు. జగిత్యాలలో కవిత ప్రసంగిస్తూ.. ‘‘తెలంగాణ ఉద్యమం మాదిరిగానే బీసీల హక్కుల కోసం ఉద్యమించాలి’’ అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ రెండింటినీ టార్గెట్ చేస్తూ.. ” ఆ రెండు పార్టీలు దశాబ్దాలుగా బీసీలను పట్టించుకోలేదు” అని తీవ్ర విమర్శలు గుప్పించారు.
సొంత పార్టీని ఇరకాటంలో పడేసేలా..
ఇక్కడే కీలక మలుపు ఉంది. కవిత కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం కావడం లేదు. ఆమె సొంత పార్టీని ఇరకాటంలో పడేసేలా అడుగులు వేస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని, కుల గణనను జాతీయ జనగణనలో భాగంగా చేయాలని కవిత కోరుతున్నారు. అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలేే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ బీఆర్‌ఎస్‌ను తక్షణమే స్పందించాల్సిన పరిస్థితిలోకి నెట్టేసే రాజకీయ ఆయుధాలు. కానీ, బీఆర్‌ఎస్ నేతలు ఈ దిశగా వెళ్లడానికి ఇష్టపడటం లేదు. పలువురు బీఆర్‌ఎస్ నేతలు అంతర్గతంగా కవిత వ్యూహాత్మక రాజకీయాలకు మద్దతు ఇవ్వడం లేదు. ఆమె తిరిగి రాజకీయ బలాన్ని సంతరించుకోవడం అనేది పార్టీలోని కొందరిని అసహనానికి గురిచేస్తోంది. కవితకు పార్టీలో ఎంత మేరకు అవకాశం కల్పించాలి అనే దానిపై బీఆర్ఎస్‌లో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది భావన ఏమిటంటే.. కవిత బీసీ హక్కుల కోసం పోరాడుతున్నప్పటికీ, ఈ పోరాటం అంతా రాజకీయంగా తాను సొంతంగా తిరిగి నిలబడటానికే. కవిత ముందుకు సాగుతున్న తీరు అనేది పార్టీ అగ్రనాయకత్వానికి అస్సలు నచ్చడం లేదని అంటున్నారు.
త్వరలోనే సమాధానం
ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కవిత ప్రతీ కార్యక్రమాన్ని కళ్లప్పగించి గమనిస్తోంది. బీసీల సంఘాలు కవితకు మద్దతుగా నిలిచిన సందర్భాల్లో, పార్టీ ఆమెను విస్మరించలేకపోతోంది. ఒకవేళ భవిష్యత్తులో కవిత పోరాటానికి విస్తృత మద్దతు లభించకపోతే, బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆమె స్థానం మరింత బలహీనపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం, ఆమె రాజకీయంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కవిత చెబుతున్న విధంగా బీసీ హక్కుల ఉద్యమాన్ని బీఆర్‌ఎస్ పార్టీ అంగీకరించి ఆమెకు మద్దతుగా నిలవాలా ? ఆమెను ఇంకొంత కాలం మౌనంగా ఉంచాలా ? అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం లభించనుంది.
Also Read :Ranveer Allahbadia: ‘‘తల్లిదండ్రులు అది చేస్తుంటే చూస్తావా ?’’.. యూట్యూబర్ నీచ వ్యాఖ్యలపై దుమారం
ఆ ఎమ్మెల్యేలకు టెలిఫోన్ కాల్స్: తెలంగాణలో ఓ రహస్య సమావేశానికి చుక్కెదురు
అది చాలా కీలకమైన రహస్య సమావేశం. శ్రద్ధగా, ప్రణాళికా బద్ధంగా.. విశ్వసనీయుల మధ్య చర్చ జరగాల్సిన సమావేశం అది. కానీ, కొన్ని ఫోన్ కాల్స్ అన్నీ తారుమారు చేశాయి. సమావేశం మొదలయ్యే ముందు రాత్రి వచ్చిన కొన్ని కీలకమైన కాల్స్‌తో పెనుమార్పులు జరిగాయి.
హైదరాబాద్‌కు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి మారిపోయిన 9 మంది మాజీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్ చేశారు. వీరంతా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి. నరసింహాచార్యులు నుంచి ఇటీవలే అనర్హత నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు. అందరూ ఒకే చోట కలవాలని, తమ రాజకీయ భవిష్యత్తుపై చర్చించాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశాన్ని సీనియర్ ఎమ్మెల్యే తన నివాసంలో గోప్యంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే, ఈ సమావేశం ముందురోజు రాత్రే చీలిపోయింది. “ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న” ఓ కీలకమైన వ్యక్తి ఈ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ఫోన్ కాల్ చేసి.. “మీ స్థానం అస్థిరతకు గురికాకుండా చూసుకుంటాం. మీ భవిష్యత్తుకు ముప్పు లేకుండా చర్యలు తీసుకుంటాం. అందుకే ఆ సమావేశానికి వెళ్లకండి’’ అంటూ గట్టిగా హెచ్చరించారు. ఈ ఫోన్ కాల్స్ ప్రభావం స్పష్టంగా కనిపించింది.
సీనియర్ ఎమ్మెల్యేకు షాక్
ఇప్పటికే అనేక మంది అసంతృప్తులతో టచ్‌లో ఉన్న సదరు సీనియర్ ఎమ్మెల్యే, ఈ సమావేశం రద్దు కావడాన్ని తనకు తగిలిన మరో ఎదురు దెబ్బగా భావించారు. అనుచరులు భూముల సమస్యలు, రాజకీయ అస్థిరత వంటి అంశాలతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఆ సీనియర్ ఎమ్మెల్యే దీన్ని మరో విశ్వాస ఘాతుకంగా అనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లోనూ పార్టీ ఫిరాయించే దిశగా సదరు ఎమ్మెల్యే రిస్కీ నిర్ణయం తీసుకున్నాడు. ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానించిన అగ్ర నాయకులు, ఇప్పుడు సదరు సీనియర్ ఎమ్మెల్యేను కాపాడే విషయంలో ఆచితూచి స్పందిస్తుండటం గమనార్హం.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల ఆధారంగా అసెంబ్లీ స్పీకర్ జి. ప్రసాద్ కుమార్‌కు ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో “పార్టీ మారినందుకు మమ్మల్ని అనర్హులుగా ప్రకటించొద్దు” అని బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శికి వివరణ ఇవ్వాల్సి ఉంది. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు తమ వివరణ ఇచ్చేందుకు కొంత సమయం కోరారు.
నోటీసులు అందుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు..
- బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
- చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
- జగిత్యాల ఎమ్మెల్యే ఎం. సంజయ్ కుమార్
- గద్వాల ఎమ్మెల్యే బీ. కృష్ణమోహన్ రెడ్డి
- పఠాన్ చెరు ఎమ్మెల్యే జీ. మహిపాల్ రెడ్డి
- రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్
- శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ
- ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
- స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
- భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు
రక్షిస్తారా ? బలి చేస్తారా ?
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ “నేను అసెంబ్లీ కార్యదర్శి నుంచి నోటీసులు ఇప్పటి వరకు పొందలేదు. నేను ఎటువంటి తప్పు చేయలేదు. నా జవాబును సమయానికి ఇస్తాను,” అని అన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు మాత్రం “నాకు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసు వచ్చింది. నా న్యాయ సలహాదారులతో మాట్లాడి, సమాధానం ఇస్తాను” అని స్పష్టం చేశారు. ఈ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోగలరా? లేదంటే రాజకీయంగా బలికావాల్సి వస్తుందా? అనే అనుమానాలు పెరుగుతున్నాయి. దీని వెనుక ఎవరి హస్తం ఉంది? మళ్లీ మరో ఫోన్ కాల్ ఈ వ్యవహారాన్ని తారుమారు చేస్తుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు రక్షణ ఉందా? లేదా చర్యలను ఎదుర్కోవాల్సిందేనా ? అనేది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read :RK Roja : రోజా సీటుకు ఎసరు.. 12న వైఎస్సార్ సీపీలోకి గాలి జగదీష్ ప్రకాశ్ ?
తెలంగాణ కేబినెట్ విస్తరణ: వాగ్దానాలు, అధికారం, రాజకీయ లాబీయింగ్
తెలంగాణలో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ(Telanganas Power Struggles) అనేది అంతులేని కసరత్తుగా మారింది. కేవలం ఆరు ఖాళీల కోసం దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు పోటీలో ఉన్నారు. కానీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన చర్చలు వేగంగా ముందుకు సాగడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చారు. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ గురించి ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకునేద లేదని ఆయన స్పష్టంగా చేశారు. అయినప్పటికీ మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కుతంత్రాలు, లాబీయింగ్ జరుగుతూనే ఉన్నాయి. మంత్రి వర్గ విస్తరణలో ఇంత ఆలస్యానికి ప్రధాన కారణం సీనియర్ మంత్రులు, కీలక నేతల మధ్య విభేదాలే. వారంతా తమకు అనుకూలమైన వారిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలంటూ లాబీయింగ్ చేస్తున్నారు. ఢిల్లీలోని అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఒక్కో సీనియర్ నేత తన సొంత జాబితాను సిద్ధం చేసుకొని కాంగ్రెస్ హైకమాండ్ వద్దకు వెళ్తున్నాడు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ఇప్పటివరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం అనేది సమస్యాత్మకంగా మారింది. ఆదిలాబాద్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కేబినెట్‌లో ఒక స్థానానికి పోటీ పడుతున్నారు. ఈ పోరు అంతర్గత విభేదాలకు దారితీసింది. వీటిని ఎలా పరిష్కరించాలనే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏకాభిప్రాయానికి రాలేకపోతోంది.
బీసీలకు డిప్యూటీ సీఎం పదవి
మంత్రి పదవుల కేటాయింపు వ్యవహారంలో తాజాగా మరో కొత్త మలుపు వచ్చింది. బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. తెలంగాణలో బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, వారికి ఒక డిప్యూటీ సీఎం సీటును కేటాయించాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో మంత్రివర్గ విస్తరణ చేస్తే కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా అసమ్మతి పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈప్రక్రియను కొంత ఆలస్యం చేయడమే మంచిదని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన వారు, పార్టీలో చేరే సమయంలో తమకు ఇచ్చిన హామీల గురించి ఢిల్లీ పెద్దలను నిలదీస్తున్నారు. “మాకు హామీ ఇచ్చిన మేరకు పదవులు ఇంకా రాలేదు” అంటూ నలుగురు ఎమ్మెల్యేలు అడిగినట్లు తెలిసింది. మరొక సీనియర్ నేత, ఎన్నికల్లో కీలక పాత్ర పోషించానని చెప్పుకుంటూ, తనకు కూడా ఒక కీలక పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 6 మంత్రి పదవులకు 15 మంది గట్టిగా పోటీలో ఉండటంతో, దీనిపై నిర్ణయం తీసుకోవడం అనేది సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది. ఇది కేవలం పరిపాలనా సంస్కరణ కాదు, అధికార సమీకరణ. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు, రాజకీయ భవిష్యత్తును నిర్ధారించుకునే కీలక సమరం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.. తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు? ఇంకా ఎంత ఆలస్యం? రాజకీయ వర్గాల్లో ఒక్కటే చర్చ జరుగుతోంది. కేబినెట్ కుర్చీలు ఎవరికి అనే ప్రశ్న అందరి మదిలో ఉదయిస్తోంది.