Heavy Rain : జలదిగ్బంధంలో వరంగల్ నగరం
Heavy Rain : భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది
- By Sudheer Published Date - 11:23 AM, Tue - 12 August 25

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న కుండపోత వర్షాలకు (Heavy Rain) వరంగల్ (Warangal) నగరం మరోసారి జలదిగ్బంధంలో చిక్కుకుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని వీధులు, లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. ఇళ్ళలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీల్లో జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ముఖ్యంగా వరంగల్-ఖమ్మం రోడ్డులోని అండర్ బ్రిడ్జి ప్రాంతం నీట మునిగిపోవడంతో ప్రయాణికులకు తీవ్ర అవస్థలు తప్పడం లేదు.
Election Commission : మరో 476 రాజకీయ పార్టీల రద్దుకు ఈసీ నిర్ణయం
గత 12 గంటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 92.9 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఈ వర్షాల కారణంగా జిల్లాలోని పలు మార్గాల్లో చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో రహదారులపై నీరు చేరి ప్రమాదకరంగా మారాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే, గతంలో మాదిరిగానే నగరం మరోసారి పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రజలు అనవసరంగా ఇళ్ళ నుండి బయటకు రావద్దని, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, రెవెన్యూ అధికారులు కోరుతున్నారు. వర్షం తగ్గిన తర్వాతే పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అవకాశముంది.