Fake Bomb Call : ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంకి బాంబు బెదిరింపు.. వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్ నగరంలోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయాల్లో బాంబులు అమర్చినట్లు పోలీసులకు కాల్ వచ్చింది. అయితే ఇది
- By Prasad Published Date - 07:07 AM, Tue - 20 June 23

హైదరాబాద్ నగరంలోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయాల్లో బాంబులు అమర్చినట్లు పోలీసులకు కాల్ వచ్చింది. అయితే ఇది ఫేక్ కాల్ అని నిర్థారించిన పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడు జైని రాధాకృష్ణగా పోలీసులు గుర్తించారు. ఐటీ శాఖలో భయాందోళనలు సృష్టించాలని ప్లాన్ చేసి అధికారుల నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు అతని ప్లాన్‌ను విఫలం చేసి, ఆదివారం సాయంత్రం హయత్‌నగర్‌లోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అతన్ని అరెస్టు చేశారు. జూన్ 11న గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు వచ్చిన రాధాకృష్ణ తన ప్లాన్‌ను అమలు చేసేందుకు హయత్‌నగర్‌కు వెళ్లాడు. 100కు డయల్ చేసి ఏసీ గార్డ్స్, బషీర్‌బాగ్, కవాడిగూడ, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని ఐటీ కార్యాలయాల్లోని రహస్య ప్రదేశాల్లో బాంబు పెట్టినట్లు పోలీసులకు సమాచారం అందించాడు. కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బియ్యం వ్యాపారంలో భారీగా నష్టం రావడంతో నిందితుడు ఈ పథకం పన్నాడని పోలీసులు తెలిపారు. ఆర్థికంగా నష్టపోవడంతో భార్యకు విడాకులు ఇచ్చి మద్యానికి, గుట్కాకు బానిసయ్యాడని పోలీసులు తెలిపారు.