Jubilee Hills Byelection: అక్టోబర్ 4 లేదా 5న జూబ్లిహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్
Jubilee Hills Byelection: కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 4, 5 తేదీల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్‌ను కూడా ప్రకటించే అవకాశముందని సమాచారం
- Author : Sudheer
Date : 30-09-2025 - 7:32 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక (Jubilee Hills Byelection) రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా విడుదలైన తుది ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం 3,98,982 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 2,07,367 మంది పురుషులు, 1,91,590 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. గత ఎన్నికల కంటే ఈసారి 1.61 శాతం ఎక్కువ మంది ఓటర్లు నమోదు కావడం గమనార్హం. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లలో సగటున 980 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ఓటర్లు తమ పేర్లు తుది జాబితాలో ఉన్నాయో లేదో ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ లేదా “వోటర్ హెల్ప్‌లైన్” యాప్ ద్వారా పరిశీలించవచ్చు. అలాగే ఫారం-6, ఫారం-8 ద్వారా పేరు చేర్చడం, సరిచేయడం వంటి ఫిర్యాదులు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 4, 5 తేదీల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్‌ను కూడా ప్రకటించే అవకాశముందని సమాచారం. బీహార్‌లోనూ మంగళవారమే పూర్తి స్థాయి ఓటర్ల జాబితా విడుదల చేయగా, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా దాదాపు 60 లక్షలకుపైగా పేర్లను తొలగించారు. మరణించిన వారు, శాశ్వతంగా వలసపోయిన వారు, డూప్లికేట్ ఓట్లు ఉన్న వారిని తొలగించడం ద్వారా పారదర్శకత సాధించామంటూ ఈసీ పేర్కొంది. ఈ ప్రయత్నంపై కొన్ని వివాదాలు వచ్చినప్పటికీ, అన్ని వివరాలను సమీక్షించడానికి ఈసీ నాలుగు రోజుల సమయం తీసుకోవడం గమనార్హం.
Arattai App: ట్రెండింగ్‌లో అరట్టై.. ఈ యాప్ సీఈవో సంపాదన ఎంతో తెలుసా?
జూబ్లీహిల్స్ సీటు బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కావడంతో, ఆ పార్టీ ఈ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని శక్తివంచనలేకుండా కృషి చేస్తోంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పేరును అభ్యర్థిగా ఖరారు చేసి, పార్టీ నేతలంతా ప్రచారంలో నిమగ్నమయ్యారు. మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత లేదని నిరూపించుకోవడానికి ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో విజయం సాధించిన అనుభవం ఉండటంతో, జూబ్లీహిల్స్‌లోనూ అదే ధోరణి కొనసాగుతుందని భావిస్తోంది. ఈ నియోజకవర్గంలో మజ్లిస్ ప్రభావం గణనీయంగా ఉండటం వలన, ఆ పార్టీ పోటీ చేస్తుందా లేదా ఎవరికి మద్దతు ఇస్తుందన్న దానిపై ఫలితం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.