Etela Vs Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో మరోసారి అసంతృప్తి జ్వాలలు
Etela Vs Bandi Sanjay : సోషల్ మీడియా పోస్టులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఈటల రాజేందర్, ప్రస్తుతానికి సంయమనం పాటిస్తున్నప్పటికీ, పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత 'బ్లాస్ట్' అయ్యే అవకాశం ఉందని
- Author : Sudheer
Date : 13-12-2025 - 9:45 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ బీజేపీలో ముఖ్య నాయకులైన బండి సంజయ్ మరియు ఈటల రాజేందర్ మధ్య జరుగుతున్న వర్గపోరాటం కొత్త మలుపులు తిరుగుతోంది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో మొదలైన ఈ వివాదం అంతకంతకూ పెద్దదవుతోంది. సుదీర్ఘకాలం హుజూరాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన ఈటల రాజేందర్, ఇప్పుడు మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పటికీ, నియోజకవర్గంపై తన పట్టు తగ్గలేదని అంటున్నారు. అయితే, స్థానిక ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులుగా సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా ఎక్కువగా బండి సంజయ్ అనుచరులే బరిలో నిలబడటంతో వివాదం తీవ్రమైంది. ఈటల తన అనుచరులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా వారిని బరిలోకి దింపినట్లు సమాచారం. ఈ పోటీలో బండి సంజయ్ మద్దతుదారులే ఎక్కువగా గెలిచినట్లు ప్రచారం జరుగుతుండటంతో, హుజూరాబాద్‌లో బండి వర్గీయులు బలంగా మారుతున్నట్లు స్పష్టమవుతోంది.
YCP : రాజకీయాల్లోకి మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె ..?
హుజూరాబాద్ పరిణామాల నేపథ్యంలో బండి సంజయ్ పీఆర్వోగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఈటల రాజేందర్‌ను కించపరుస్తూ పోస్టులు పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఆ పోస్టుల్లో ఈటల రాజేందర్ బీజేపీ తరపున కాదన్నట్లుగా ఉండటంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఈటల రాజేందర్ ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. “తాను బీజేపీ పార్టీ ఎంపీని. ఇలాంటి పోస్టులను చూశాను. అవగాహన లేని, పిచ్చోళ్లు పెట్టే పోస్టులు అవి. అవగాహన ఉన్నోడు అలా పోస్టులు పెడతాడా?” అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలు తేల్చుకుంటారని మండిపడ్డారు. ఈ విషయంపై పార్టీ తేల్చుకుంటుందని, ‘టైమ్ విల్ డిసైడ్’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియా పోస్టులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఈటల రాజేందర్, ప్రస్తుతానికి సంయమనం పాటిస్తున్నప్పటికీ, పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత ‘బ్లాస్ట్’ అయ్యే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. “ఎవరు ఏమి చేస్తున్నారు, ఎవరేం చెప్తున్నారో ప్రజలకు అర్థమవుతుంది. సందర్భం వచ్చినప్పుడు అన్ని చెప్తాను. రెండు, మూడోవ విడత ఎన్నికల అయ్యాక జరిగిన పరిణామాలన్నీ చెప్తాన”ని ఆయన మీడియాకు తెలిపారు. హుజూరాబాద్‌లో తన క్యాడర్‌కు అన్యాయం జరిగితే తాను ఊరుకునేది లేదని ఆయన కొంతకాలంగా బహిరంగంగానే చెబుతున్నారు. స్థానిక ఎన్నికల్లో తన అనుచరులకు న్యాయం జరగడం లేదనే భావన ఈటలలో బలంగా ఉంది. అందుకే, పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాక ఈటల రాజేందర్ ఈ వర్గపోరాటంపై ఫైర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.