YCP : రాజకీయాల్లోకి మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె ..?
YCP : గత ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసిన బొత్స సత్యనారాయణ, తన కుమార్తె డాక్టర్ బొత్స అనూషను రాజకీయాల్లోకి ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
- Author : Sudheer
Date : 13-12-2025 - 8:39 IST
Published By : Hashtagu Telugu Desk
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వారసత్వం కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ముఖ్యంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నవయువ రక్తంతో కూడిన వారసుల సందడి కనిపిస్తోంది. సీనియర్ నాయకులు తమ వారసులను రాజకీయాల్లోకి క్రియాశీలకంగా తీసుకురావడానికి కసరత్తు చేస్తుండగా, భవిష్యత్ రాజకీయాలకు కీలకంగా భావించే స్థానిక సంస్థల ఎన్నికలు, జడ్పీ పీఠంపై కన్నేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం కూడా ఉత్తరాంధ్రపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని వేదికగా చేసుకుని, పార్టీ నేతలకు ‘ఇంటింటికీ కూటమి మోసాలను ఎండగట్టాలని’ టార్గెట్ పెట్టింది. ఈ కార్యక్రమం సీనియర్ నేతలకు అగ్నిపరీక్షలా మారగా, మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూష ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం ఇప్పుడు చీపురుపల్లి రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Dekhlenge Saala Song: చాల ఏళ్ల తర్వాత పవన్ నుండి ఎనర్జిటిక్ స్టెప్పులు
గత ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసిన బొత్స సత్యనారాయణ, తన కుమార్తె డాక్టర్ బొత్స అనూషను రాజకీయాల్లోకి ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో బొత్స అనూష యాక్టివ్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ఆమె ప్రతి ఒక్కరితో కలివిడిగా మాట్లాడటం, సీనియర్ నాయకులు, కార్యకర్తలకు గౌరవం ఇవ్వడం చూసి కేడర్ అంతా ఆమెను తండ్రికి తగ్గ వారసురాలిగా భావిస్తోంది. పార్టీ కేడర్‌ను గుండెల్లో పెట్టుకుంటారనే భరోసాను ఆమె మాటలతో కార్యకర్తలకు ఇచ్చారు. కోటి సంతకాల సేకరణలో పాల్గొంటూ, గ్రామ గ్రామానికి వెళ్లి ప్రజలను కలిసి, స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. బొత్స ఝాన్సీ, సత్యనారాయణల కూతురుగా ఆమె నడవడిక, వ్యవహారిక తీరును చూసిన ప్రజలు కూడా తమ ఇంటి అమ్మాయిగా ఆదరించారు. జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ వంటి సీనియర్ నేతలతో ఆమె వ్యవహరించిన తీరు పార్టీ శ్రేణులను ఆకట్టుకుంది.
ఉత్తరాంధ్ర నేతలు తమ వారసులను స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దించడం వెనుక అసలు టార్గెట్ అసెంబ్లీ ఎన్నికలే అనే ప్రచారం బలంగా నడుస్తోంది. 2028లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుందని, దీనివల్ల ఉమ్మడి విజయనగరం జిల్లాలో కొత్తగా రెండు, మూడు స్థానాలు పెరిగే అవకాశం ఉందని అంచనా. మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు కానుండటం, సరిహద్దులు, రిజర్వేషన్ల మార్పులు జరిగే నేపథ్యంలో, పునర్విభజన పూర్తయ్యే వరకు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటే ఎమ్మెల్యే టికెట్ అడిగే అవకాశం ఉంటుందని బొత్స కుటుంబం భావిస్తోంది. ఈ వ్యూహాత్మక అడుగుల్లో భాగంగానే బొత్స అనూష క్రియాశీలక రాజకీయ ప్రవేశం జరిగిందని పరిశీలకులు చెబుతున్నారు. డాక్టర్ అనూషతో పాటు బొత్స సందీప్ కూడా రాజకీయ ప్రవేశం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని, మొత్తంగా బొత్స కుటుంబం తమ రాజకీయ వారసత్వాన్ని పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తోందనే చర్చ ఇప్పుడు ఉత్తరాంధ్రలో జోరుగా నడుస్తోంది.