Telangana High Court : దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసు.. హైకోర్టు కీలక తీర్పు
ఎన్‌ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. నిందితుల అప్పీల్ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం.. అక్తర్, జియా ఉర్ రహమాన్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, అజాజ్ షేక్‌కు ఉరి శిక్ష విధించింది.
- By Latha Suma Published Date - 11:18 AM, Tue - 8 April 25

Telangana High Court : తెలంగాణ హైకోర్టు దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసు నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష విధించింది. ఎన్‌ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ ఐదుగురు దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను ఉన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఎన్‌ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. నిందితుల అప్పీల్ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం.. అక్తర్, జియా ఉర్ రహమాన్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, అజాజ్ షేక్‌కు ఉరి శిక్ష విధించింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని బస్టాపులో, మిర్చిపాయింట్ వద్ద 2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ పరారీలో ఉండగా, మిగిలిన ఐదుగురు నిందితులకు ఎన్‌ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబరు 13న తీర్పు వెలువరించింది.
Read Also: Kia Car Engines: కియా పరిశ్రమలో 900 కార్ల ఇంజిన్లు మాయం.. ఏమయ్యాయి ?
ఈ తీర్పును సవాల్ చేస్తూ ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. 2013, ఫిబ్రవరి 21న హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు సంభవించాయి. ఎన్‌ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు చేసింది. 157 మంది సాక్ష్యాలను నమోదుచేసింది. ఈ ఘటనలో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ప్రధాన నిందితుడిగా తేలింది. అనంతరం ఉరిశిక్ష ధ్రువీకరణ నిమిత్తం ఎన్‌ఐఏ కోర్టు తీర్పును హైకోర్టుకు నివేదించింది. దీంతోపాటు ఐదుగురు నిందితులు కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ పి.శ్రీసుధలతో కూడిన ధర్మాసనం సుమారు 45 రోజులపాటు సుదీర్ఘ విచారణ జరిపి తీర్పు వాయిదా వేసింది. నేడు ఎన్‌ఐఏ కోర్టు తీర్పును సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కాగా, మూడేళ్లు ఈ కేసులు విచారించిన ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టు.. నిందితులకు మరణశిక్షను విధించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన యాసిన్ భత్కల్‌ను 2013లో నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఢిల్లీ, దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలగా తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక, ఉరిశిక్ష పడిన నిందితుల్లో అసదుల్లా అక్తర్ అలియాస్ హద్ది, జియా ఉర్ రహమాన్ అలియాస్ వఘాస్ అలియాస్ నబీల్ అహమ్మద్, మహ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ అలియాస్ మోను, యాసిన్ భత్కల్ అలియాస్ షారూఖ్, అజాజ్ షేక్ అలియాస్ సమర్ ఆర్మాన్ తుండె అలియాస్ సాగర్ అలియాస్ ఐజాజ్ సయ్యద్ షేక్ ఉన్నారు.
Read Also: Black Rice: బ్లాక్ రైస్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?