Deputy CM Bhatti : గ్రీన్ ఎనర్జీలో లక్ష కోట్ల పెట్టుబడి.. ముందుకొచ్చిన కంపెనీలు : డిప్యూటీ సీఎం
ప్రస్తుతం రాష్ట్రంలో 8,938 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి(Deputy CM Bhatti) జరుగుతోంది.
- By Pasha Published Date - 02:24 PM, Mon - 17 March 25

Deputy CM Bhatti : తెలంగాణ ప్రభుత్వ గ్రీన్ పవర్ పాలసీకి ఆకర్షితమై గ్రీన్ ఎనర్జీ విభాగంలో రూ.80వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల దాకా పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు (MOU) కుదుర్చుకున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 2030 నాటికి 20వేల మెగావాట్లు, 2040 నాటికి 40వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన చెప్పారు. సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ వంటి విభాగాల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గ్రీన్ పవర్ లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు సింగిల్ విండో పద్ధతుల్లో అనుమతులు మంజూరు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం చెప్పారు. స్టాంప్ డ్యూటీని రీయింబర్స్ చేయడంతో పాటు నాలా కన్వర్షన్‌ను సులభతరం చేశామన్నారు. ఇవాళ తెలంగాణ శాసన మండలిలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపై చర్చ జరిగింది. ఈసందర్భంగా ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్, కల్వకుంట్ల కవిత, భాను ప్రసాద్ ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సమాధానమిచ్చారు.
Also Read :Babri Like Fate : బాబ్రీకి పట్టిన గతే ఔరంగజేబు సమాధికీ పడుతుంది.. వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ వార్నింగ్
రాష్ట్రం వైపు పెట్టుబడిదారుల చూపు
‘‘రాష్ట్రానికి తక్కువ ధరకే కాలుష్య రహిత విద్యుత్‌ను అందించడమే లక్ష్యంగా సమగ్ర గ్రీన్ పవర్ పాలసీని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది’’ అని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ‘‘దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుల పర్యటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు రాష్ట్రానికి వచ్చారు. వారు క్షేత్రస్థాయిలో సర్వే చేసుకుంటున్నారు. సర్వేలు పూర్తయ్యాక రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,938 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి(Deputy CM Bhatti) జరుగుతోంది. 2040 నాటికి 40 వేల మెగావాట్లు రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది’’ అని ఆయన వెల్లడించారు. తెలంగాణ సర్కారు ఇటీవలే రాజస్థాన్ ప్రభుత్వంతోనూ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందాలు చేసుకున్న విషయాన్ని భట్టి గుర్తు చేశారు.
స్వయం సహాయక సంఘాల మహిళలకు శుభవార్త
‘‘స్వయం సహాయక సంఘాల మహిళలతో 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి జెన్‌కోతో MOU చేసుకున్నాం. ప్రభుత్వ ఖాళీ భూములను స్వయం సహాయక సంఘాల మహిళలకు లీజుకు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్నాం. మహిళా సంఘాలు ఉత్పత్తి చేసిన విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది’’ అని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. ‘‘రోజురోజుకు విద్యుత్తు డిమాండ్ పెరుగుతోంది. ఆ అవసరాన్ని తీర్చేందుకు ప్రభుత్వ ఖాళీ భూముల్లో, దేవాదాయ శాఖ ఖాళీ భూముల్లో, సాగునీటి శాఖలో సోలార్, ఫ్లోటింగ్ సోలార్ ద్వారా గ్రీన్ పవర్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేశాం’’ అని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాని యువత స్వయం ఉపాధి కోసం బ్యాంకుల సహకారంతో గ్రీన్ పవర్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చన్నారు.
Also Read :US Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల దుర్మరణం
ఎలక్ట్రికల్ వాహనాల విక్రయాలు పెరిగాయి
‘‘రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు రిజిస్ట్రేషన్ లో ట్యాక్స్ ఫ్రీ చేశాం. దీంతో ఎలక్ట్రికల్ వాహనాల విక్రయాలు పెరిగాయి. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను పెట్టుకునేందుకు ఎవరైనా ముందుకు వస్తే అన్ని అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది’’ అని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ‘‘తీవ్ర వాతావరణ కాలుష్యం వల్ల ఢిల్లీ ప్రజలు ఏడాదిలో మూడు నెలలు వలస వెళ్లిపోతున్నారు. ఆ పరిస్థితి హైదరాబాద్ కు రాకుండా చూసేందుకు ఇక్కడ ఎలక్ట్రికల్, బ్యాటరీ బేస్డ్ బస్సులను ప్రవేశ పెడుతున్నాం. డీజిల్ బస్సులను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాం. హైదరాబాద్ సిటీలో కొత్తగా డీజిల్ ఆటోలకు అనుమతి ఇవ్వడం లేదు. బ్యాటరీతో నడిచే ఆటోలను ప్రోత్సహిస్తున్నాం’’ అని డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. కాలుష్య నియంత్రణ కార్యక్రమాన్ని హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు బయటి వరకూ విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందన్నారు. గ్రీన్ పవర్ పాలసీకి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరితే ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ పాలసీకి సంబంధించిన పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందన్నారు.