Job Mela In Madhira: జాబ్ మేళాలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి!
9,000 కోట్ల పెట్టుబడితో ఈ పథకం ప్రవేశపెట్టామని, జూన్ 2, 2025న రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన వారికి సాంక్షన్ లెటర్లు పంపిణీ చేస్తామన్నారు.
- By Gopichand Published Date - 01:48 PM, Mon - 21 April 25

Job Mela In Madhira: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర మండలంలో నిర్వహిత జాబ్ మేళాలో (Job Mela In Madhira) ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గత పదేళ్లలో రాజకీయ నాయకులు మాత్రమే ఉద్యోగాలు పొందారని, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఫలితాలు సాధించలేకపోయారని విమర్శించారు. మూడు అంచెల్లో ఉద్యోగాల కల్పన జరుగుతుందని వివరించారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్: జాబ్ క్యాలెండర్ విడుదల చేసి మొదటి ఏడాదిలోనే 56,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 30,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతున్నట్లు తెలిపారు.
బహుళజాతి సంస్థల: గ్లోబలైజేషన్‌లో భాగంగా రాష్ట్రంలో వనరులు ఏర్పాటు చేసి బహుళజాతి సంస్థలను ఆకర్షించడం ద్వారా లక్షలాది యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటనలో 1.80 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నారని, ప్రస్తుతం సీఎం జపాన్‌లో పెట్టుబడుల ఆకర్షణకు పర్యటిస్తున్నారని చెప్పారు.
రాజీవ్ యువ వికాసం పథకం: 9,000 కోట్ల పెట్టుబడితో ఈ పథకం ప్రవేశపెట్టామని, జూన్ 2, 2025న రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన వారికి సాంక్షన్ లెటర్లు పంపిణీ చేస్తామన్నారు. రాజీవ్ గాంధీ ఐటీ విప్లవానికి నాంది పలికారని, హైదరాబాద్‌లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీకి పునాది వేశారని గుర్తు చేశారు. 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు మరో నాలెడ్జ్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.
మధిర జాబ్ మేళా ద్వారా ఒకే రోజు 5,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని, యువత ఈ అవకాశాలను మొదటి మెట్టుగా భావించి పెద్ద లక్ష్యాలు సాధించాలని కోరారు. యువత రాష్ట్ర జీడీపీ పెరుగుదలకు, కుటుంబ, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలని, ఖాళీగా ఉండి విద్రోహ శక్తులు లేదా మత్తు పదార్థాలకు బానిస కాకుండా సన్మార్గంలో నడవాలని సూచించారు.
సాంకేతిక నైపుణ్యాలు లేని వారికోసం 65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని, నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య కోసం 60 యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మాణానికి 11,600 కోట్లు కేటాయించామని తెలిపారు. ఈ స్కూల్స్ ద్వారా 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచిత నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. రాష్ట్ర చరిత్రలో విద్యా రంగానికి ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎన్నడూ కేటాయించలేదని, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను అప్‌గ్రేడ్ చేసి అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.