Pawan Kalyan: పవర్ వీరాభిమాని నిరంజన్ మృతి.. తీవ్ర విషాదంలో పవన్ కల్యాణ్
- Author : Vamsi Chowdary Korata
Date : 08-07-2026 - 9:31 IST
Published By : Hashtagu Telugu Desk
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) మృతి చెందాడు. గత కొంతకాలంగా అరుదైన జన్యు సంబంధిత వ్యాధి, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న నిరంజన్.. ఆరోగ్యం మరింత క్షీణించడంతో హనుమకొండలోని హనుమాన్ నగర్‌లోని తన నివాసంలో కన్నుమూశాడు. వ్యాధి కారణంగా చిన్న వయసు నుంచే మంచానికే పరిమితమైన నిరంజన్‌ను స్థానికులు, కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమగా ‘చోటా గబ్బర్ సింగ్’ అని పిలుచుకునేవారు. శారీరక వైకల్యం ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ అంటే అతనికి విపరీతమైన అభిమానం. తన అభిమాన హీరోను జీవితంలో ఒక్కసారైనా చూడాలనేది నిరంజన్ చివరి కోరిక. ఈ విషయాన్ని రాధా మనోహర్ దాస్ సహా.. పలువురు జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు.
తన అభిమాని పరిస్థితిని తెలుసుకుని చలించిపోయిన పవన్.. గత నెల హనుమకొండలోని నిరంజన్ నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. మంచానికే పరిమితమైన నిరంజన్ పక్కన కూర్చుని అతడిని ఆత్మీయంగా హత్తుకుని ధైర్యం చెప్పారు. నిరంజన్ గతంలో తన సినిమాల పాటలకు మంచం పైనే పడుకుని వేసిన డాన్స్ వీడియోలను చూసి ఎంతో మురిసిపోయారు. ఇద్దరం కలిసి OG-2 సినిమా చూద్దామని.. అందుకోసం ప్రత్యేకంగా సినిమా స్పెషల్ షో వేయిస్తానని పవన్ మాట ఇచ్చారు. ఈ సందర్భంగా నిరంజన్ కుటుంబానికి పవన్ కల్యాణ్ రూ. 1 లక్ష నగదు సాయాన్ని అందించారు. అంతేకాకుండా, నిరంజన్ డైరీలో ‘విత్ లవ్ టు డియర్ నిరంజన్’ అని ఒక హృదయపూర్వకమైన సందేశాన్ని రాసి అతనికి చిరస్మరణీయమైన బహుమతిగా ఇచ్చారు.
పవన్ కల్యాణ్ చూపిన మానవత్వానికి స్ఫూర్తి పొంది ప్రముఖ నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ కూడా నిరంజన్ కుటుంబానికి అండగా నిలిచారు. హనుమకొండలోని నిరంజన్ నివాసానికి స్వయంగా వెళ్లిన బండ్ల గణేష్.. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. తమ సొంత బ్యానర్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరఫున నిరంజన్ వైద్య ఖర్చులు, కుటుంబ సహాయార్థం రూ. 5 లక్షల భారీ ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. కాగా, పవన్ కల్యాణ్‌ను కలిసి ఆయనతో తీపి జ్ఞాపకాలు పంచుకుని కొన్ని రోజులు కూడా గడవకముందే నిరంజన్ మృతి చెందడం అటు కుటుంబ సభ్యులను, ఇటు పవన్ అభిమానులను, జనసేన శ్రేణులను తీవ్రంగా కలచివేస్తోంది. ఇద్దరం కలిసి OG-2 సినిమా చూద్దామని పవన్ ఇచ్చిన మాట నెరవేరకుండానే నిరంజన్ అనంతలోకాలకు వెళ్లిపోవటం దిగ్భ్రాంతికరం.
A few days ago, I came across a video of Niranjan from Hanumakonda, Warangal, who is bravely battling a rare disease and had expressed a heartfelt wish to meet me. Today, I had the privilege of visiting him and spending time with him and his family.
I went there believing I was… pic.twitter.com/jI7VZ9y0kC
— Pawan Kalyan (@PawanKalyan) June 17, 2026