Osmania Hospital: ఆధునిక వసతులతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం!
ఆసుపత్రి భవన నిర్మాణాలకు సంబంధించిన నమూనాల్లో పలు మార్పులు చేర్పులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
- By Gopichand Published Date - 08:49 PM, Sat - 25 January 25

Osmania Hospital: రానున్న వందేళ్ల అవసరాలకు తగినట్లు పూర్తి ఆధునిక వసతులతో ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital) నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి ఏ విషయంలోనూ రాజీపడొద్దని ఆయన అధికారులకు సూచించారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ఈ నెల 31న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నిర్మాణంపై తన నివాసంలో ముఖ్యమంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు. ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణాలతో పాటు బోధన సిబ్బంది, విద్యార్థి, విద్యార్థినులకు వేర్వురుగా నిర్మించే హాస్టల్ భవనాల విషయంలోనూ పూర్తి నిబంధనలు పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
ఆసుపత్రి భవన నిర్మాణాలు, పార్కింగ్, ల్యాండ్ స్కేప్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సీఎం తెలిపారు. ఆసుపత్రికి రాకపోకలు సాగించేలా నలువైపులా రహదారులు ఉండాలని.. అవసరమైనచోట ఇతర మార్గాలను కలిపేలా అండర్‌పాస్‌లు నిర్మించాలని సీఎం సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, సహాయకులు, పరామర్శకు వచ్చే వారి వాహనాలు నిలిపేందుకు వీలుగా అండర్‌గ్రౌండ్‌లో రెండు ఫ్లోర్లలో పార్కింగ్ ఉండాలన్నారు.
Also Read: HYDERABAD METRO : ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త.. ఇకపై ఇంటికి వెళ్లడం సులభతరం
డార్మిటరీ, ఫైర్ స్టేషన్, క్యాంటిన్, మూత్రశాలలు, ఎస్టీపీలు నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పిల్లలు విదేశాల్లో స్థిరపడుతుండడంతో వారు వచ్చేందుకు రెండు మూడు రోజులు పడుతోందని.. అప్పటి వరకు మృతదేహాలను భద్రపర్చేందుకు ఆధునిక సౌకర్యాలతో మార్చురీ, బాడీ ఫ్రీజింగ్ నిర్మాణాలు ఉండాలని సీఎం సూచించారు. అవయవాల మార్పిడి.. అత్యవసర సమయాల్లో రోగుల తరలింపునకు వీలుగా హెలీ అంబులెన్స్‌లు వినియోగిస్తున్నందున హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఆసుపత్రిలో అడుగుపెట్టగానే ఆహ్లాదకర వాతావరణం ఉండాలని.. ఆసుపత్రికి వచ్చామనే భావన ఉండకూడదని సీఎం సూచించారు.
ఆసుపత్రి భవన నిర్మాణాలకు సంబంధించిన నమూనాల్లో పలు మార్పులు చేర్పులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సమీక్షలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి సంగీత సత్యనారాయణ, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానా జడ్ చోంగ్తూ, ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, తదితరులు పాల్గొన్నారు.