HYDERABAD METRO : ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త.. ఇకపై ఇంటికి వెళ్లడం సులభతరం
ఇకపై మెట్రో నుంచి ఇంటికి, కార్యాలయానికి, కళాశాలలకు వెళ్లే వారు సొంత వాహనాలను వాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈవీ జిప్‌తో ఇక మీ గమ్యాన్ని ప్రశాంతంగా చేరుకోవచ్చని హామీ ఇస్తుంది.
- By Latha Suma Published Date - 08:14 PM, Sat - 25 January 25

HYDERABAD METRO : ప్రయాణికులకు మెట్రో మరో శుభవార్త చెప్పింది. ప్రయాణికులు స్టేషన్ నుంచి గమ్యస్థానానికి చేరుకోవడాన్ని సులభతరం చేసింది. కాలుష్య రహిత వాహనాలను మెట్రో స్టేషన్‌తో అనుసంధానం చేసింది. ఇకపై మెట్రో నుంచి ఇంటికి, కార్యాలయానికి, కళాశాలలకు వెళ్లే వారు సొంత వాహనాలను వాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈవీ జిప్‌తో ఇక మీ గమ్యాన్ని ప్రశాంతంగా చేరుకోవచ్చని హామీ ఇస్తుంది.
ఢిల్లీ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద మెట్రో హైదరాబాద్ మెట్రో స్టేషన్. ఉద్యోగం చేసేవారు, స్కూల్స్, కాలేజీకి వెళ్లేవారు, వ్యాపారస్తులు ఎంతోమంది మెట్రో రైలును వినియోగిస్తుంటారు. వీరంతా మెట్రో స్టేషన్‌కు రావడానికి, మెట్రో నుంచి గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఆటోలు, క్యాబ్‌లు, సొంత వాహనాలు వినియోగిస్తుంటారు. అయితే తాజాగా మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో ఫస్ట్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ వద్ద ఈవీ వాహనాలను అందుబాటులో ఉంచాలని మెట్రో నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వాహనాలను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ వాహనాలను వందకు పైగా పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ ఈస్ట్ స్టేషన్ల నుండి మల్కాజ్ గిరి, సైనిక్ పురి, ఈసీఐఎల్ వంటి ప్రాంతాలకు ఎక్కువగా నడుపుతున్నారు. వీటిని త్వరలోనే ఇతర స్టేషన్లకు, ప్రాంతాలకు విస్తరిస్తారని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో మెట్రో రైల్ వ్యవస్థను నలుదిక్కులా విస్తరిస్తున్నట్లు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ఈ మేరకు మహిళలకు సయోధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తున్నారు. ద్విచక్ర వాహనం నడపడంలో మెళుకువలు నేర్పించారు. రద్దీ ప్రాంతంలో ప్రయాణించడంపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఐదు మంది మహిళలకు డ్రైవింగ్ శిక్షణ ఇచ్చామని, భవిష్యత్‌లో వందమందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సయోధ్య ఫౌండర్ సభ్యురాలు మృదులత తెలిపారు.
Read Also: Fact Check : ఫిబ్రవరి 1 నుంచి పేపర్ కరెన్సీ బ్యాన్.. ఆ న్యూస్ క్లిప్‌లో నిజమెంత ?