Farm House Files: జగన్, మోడీ బంధానికి కేసీఆర్ పొగ
తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక పత్రిక ఏపీలో రాజకీయాలను టచ్ చేసింది. ఫామ్ హౌస్ ఫైల్స్ ప్రకారం వైసీపీలోని 70 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది.
- Author : CS Rao
Date : 14-11-2022 - 5:08 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక పత్రిక ఏపీలో రాజకీయాలను టచ్ చేసింది. ఫామ్ హౌస్ ఫైల్స్ ప్రకారం వైసీపీలోని 70 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది. ఇప్పటికే 50 మంది బీజేపీకి సరెండర్ అయ్యారని చెబుతోంది. ఇదంతా కేసీఆర్ స్కెచ్ లోని ప్లాన్ గా వైసీపీ కొట్టిపారేస్తోంది.
ఇటీవల తరచూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీ వెలుపల, లోపల గులాబీ నేతలు స్పందిస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, హరీశ్ ఏపీ రోడ్ల పరిస్థితితో పాటు అమరావతి ప్రాజెక్టు, ఉద్యోగుల జీతాల గురించి ప్రస్తావించారు. ఏపీకి చేతగాని వాటిని తెలంగాణ సర్కార్ అమలు చేస్తోందని పరోక్షంగా జగన్ మోహన్ రెడ్డి పాలనను టార్గెట్ చేశారు. తొలి రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ అన్నదమ్ముల మాదిరిగా హగ్ లు ఇచ్చుకున్నారు. ఏపీ ఆస్తులను జగన్ మోహన్ రెడ్డి రాసిచ్చారు. దీంతో ఆయన మీద ఏపీ ప్రజల్లో నెగిటివ్ కనిపించింది. అప్పటి నుంచి దూరంగా ఉంటున్నప్పటికీ ఇద్దరి మధ్య సయోధ్య ఉందని సర్వత్రా తెలిసిందే.
Also Read: Telangana DGP: ‘డీజీపీ’ పోస్టుపై ఉత్కంఠత.. రేసులో ఆనంద్, అంజనీ కుమార్!
కేంద్రంలోని బీజేపీకి కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి సన్నిహితులుగా ఉన్నారు. ఇటీవల కేసీఆర్ దూరం అయినట్టు కనిపిస్తోంది. పైగా బీఆర్ఎస్ పార్టీ ద్వారా ప్రధాని కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకోసం కనీసం 50 ఎంపీల మద్ధతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో జగన్ మోహన్ రెడ్డి మద్ధతు కోరుకుంటున్నాడు. అయితే, బీజేపీ, జగన్ మోహన్ రెడ్డి మధ్య ఉన్న బంధాన్ని విడదీయడం ఆయనకు సాధ్యం కావడంలేదు. దీంతో ఫామ్ హౌస్ ఫైల్స్ బయటకు తీశాడని వైసీపీ భావిస్తోంది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో ఒక కథనం వచ్చింది. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎరపై విచారణకు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో ఇది వెల్లడయింది. తెలంగాణ మాదిరే మరో మూడు రాష్ట్రాల్లో ఇదే తరహా కుట్రలు జరుగుతున్నాయని పేర్కొంది. ఏపీ సీఎం జగన్ తో మోదీ స్నేహపూర్వకంగా ఉంటూనే వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలను మొదలు పెట్టారని తెలిపింది. సిట్ దర్యాప్తులో ఈ విషయం వెలుగు చూసిందని ఆ న్యూస్ సారాంశం.
Also Read: KCR Politics: తెలంగాణ సీఎంగా కేటీఆర్ కు పట్టాభిషేకం?
వైసీపీకి చెందిన 70 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని, వీరిలో 55 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే లాబీయిస్టులకు టచ్ లోకి వెళ్లారని పేర్కొంది. జగన్ ను ఆప్యాయంగా కౌగిలించుకుంటూనే ఆయన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు నిందితులు సిట్ అధికారులకు చెప్పినట్టు సమాచారం ఉందని న్యూస్ ను వండివార్చింది. అయితే, ఇప్పటి వరకు ఆ న్యూస్ మీద వైసీపీ స్పందించలేదు.
ఏపీలోకి ఎంట్రీ ఇస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ప్రకటించారు. ఒక వేళ ఆయన వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను రంగంలోకి దించితే వైసీపీకి లాభమని కొందరు భావిస్తున్నారు. మరికొందరు సామాజిక ఈక్వేషన్ ప్రకారం నష్టపోతారని అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ జగన్ మోహన్ రెడ్డి బీజేపీతో విడిపోతే సరేసరి లేదంటే నేరుగా కేసీఆర్ ఏపీలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: Komatireddy Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డి కంపెనీలో ‘జీఎస్టీ’ రైడ్స్!