TPCC: అవినీతి బాగోతం తెలిసిందే.. మరి విచారణ మాటేమిటి?
గత రెండు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాక్షస క్రీడలో తెలంగాణ అమాయక రైతులు బలి అవుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
- By Balu J Published Date - 03:52 PM, Wed - 22 December 21

గత రెండు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాక్షస క్రీడలో తెలంగాణ అమాయక రైతులు బలి అవుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరిధాన్యం కొనుగోలుపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలపై తెలంగాణ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాష్కీ ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీ వేదికగా బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రజల పరువు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు వివరించాలని అమిత్ షా బీజేపీ నేతలకు సూచించారని, నా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయన్న అమిత్ షా కేసీఆర్ కుటుంబ అవినీతి పై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ఆయన ప్రశ్నించారు.
బిజెపి, టీఆర్ఎస్ కు మధ్య ఉన్న అనుబంధం, ఒప్పందం బహిర్గతం వెంటనే చేయాలని డిమాండ్ చేయాలి. తెలంగాణ సమాజాన్ని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు మోసం చేస్తున్నాయి. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో చాలదు అన్నట్లు టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఢిల్లీలో వీధి నాటకాలు మొదలుపెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు.
గత సంవత్సరం రబీలో 52 లక్షల ఎకరాల్లో వరి పండిస్తే, ఈ రబీలో వరి సాగు చేయవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయని, తెలంగాణ ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయలు ఇంటెన్సివ్ గా ప్రకటిస్తే, ఉత్పత్తి అయిన మొత్తం ధాన్యం ఎగుమతి చేయవచ్చని కాంగ్రెస్ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి బాగోతం అందరికీ తెలుసు. అయినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పై సీవీసీ, సీబీఐ తో విచారణ జరిపించాలని ఉత్తమ్ తో పాటు కోమటిరెడ్డి, మధుయాష్కీలు డిమాండ్ చేశారు.