Congress Govt : హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలం – కేసీఆర్
Congress Govt : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించిన ఆయన, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమీక్ష నిర్వహించారు
- By Sudheer Published Date - 09:00 PM, Tue - 11 March 25

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt ) తమ హామీలను (Congress Promises) అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించిన ఆయన, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమీక్ష నిర్వహించారు. రేపటి నుండి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ భారీగా అప్పులు చేస్తూనే హామీలను అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు.
రైతులకు మోసం, ప్రజలకు అన్యాయం
రైతు బంధు, సాగునీరు వంటి పథకాలను ప్రభుత్వం సరిగ్గా అమలు చేయకపోవడం రైతులకు తీరని ఇబ్బందిని కలిగిస్తోందని కేసీఆర్ ఆరోపించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను అమలు చేయకపోవడమే కాక, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని నిలిపివేయడం అన్యాయమని విమర్శించారు. గురుకుల పాఠశాలల పరిస్థితి మరింత దిగజారిపోతోందని, విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో గట్టిగా నిలబడాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించారు.
బీఆర్ఎస్‌పై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నా, అందులో వాస్తవం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు తమ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ అవినీతి ఆరోపణలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని, ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కాంగ్రెస్ అసమర్థ పాలనను ఎండగట్టాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.