Anganwadi Workers: గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. పదవీ విరమణ వయసు పెంపు!
అంగన్‌వాడీ ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్లను నెరవేర్చడంతో పాటు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ఒక అడుగుగా భావించబడుతోంది.
- By Gopichand Published Date - 09:00 PM, Sat - 31 May 25

Anganwadi Workers: తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు (Anganwadi Workers) సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. 2023 సెప్టెంబర్‌లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. వారి పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచింది. ఈ నిర్ణయం ప్రతి ఏడాది ఏప్రిల్ 30 నుంచి అమలులోకి వస్తుంది. అంతేకాకుండా అంగన్‌వాడీ టీచర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు, హెల్పర్ల బెనిఫిట్స్‌ను రూ.50,000 నుంచి రూ.1 లక్షకు పెంచింది. 60 ఏళ్లు దాటిన తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (VRS) తీసుకునే టీచర్లు మరియు హెల్పర్లకు కూడా ఈ బెనిఫిట్స్ వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 37,580 అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సుమారు 70,000 మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.
ఈ నిర్ణయం అంగన్‌వాడీ ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్లను నెరవేర్చడంతో పాటు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ఒక అడుగుగా భావించబడుతోంది. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ కింద పిల్లల ఆరంభిక విద్య, పోషణ, ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తారు. వారి సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ సంస్కరణలను ప్రవేశపెట్టింది. అదనంగా 50 ఏళ్లలోపు ఉద్యోగులకు రూ.2 లక్షల బీమా, 50 ఏళ్లు దాటిన వారికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఆసరా పెన్షన్ వంటి ఇతర ప్రయోజనాలు యథాతథంగా కొనసాగుతాయి.
Also Read: Extramarital Affair: యువకునితో మహిళ వివాహేతర సంబంధం.. స్థానికులు ఏం చేశారంటే?
అయితే కొంతమంది ఈ నిర్ణయంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ పెంపును రాజకీయ లబ్ధి కోసం తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు. మరికొందరు దీనిని అంగన్‌వాడీ ఉద్యోగుల సంక్షేమానికి చిహ్నంగా చూస్తున్నారు. ఈ నిర్ణయం అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక భద్రతను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. అంగన్‌వాడీ ఉద్యోగులు తమ సేవలకు తగిన గుర్తింపు, ఆర్థిక భద్రత కల్పించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యలు వారి పనితీరును మరింత ఉత్తేజపరిచే అవకాశం ఉంది.