CM Revanth : రేపు మహబూబ్ నగర్ లో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
CM Revanth Reddy : ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ఆయన, అమ్మాపురం కురుమూర్తి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు
- By Sudheer Published Date - 07:37 PM, Sat - 9 November 24

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) రేపు (నవంబర్ 10) మహబూబ్‌నగర్ జిల్లాలో (Mahbubnagar District) పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ఆయన, అమ్మాపురం కురుమూర్తి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రధానంగా రూ.110 కోట్లతో నిర్మించబోయే ఘాట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. శనివారం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ముంబై వెళ్లారు. ముంబైలో కాంగ్రెస్ నాయకులతో సమావేశమై, ఎన్నికల వ్యూహాలపై చర్చలు జరిపారు. శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకోనున్న ఆయన, ఆదివారం ఉదయం మహబూబ్‌నగర్‌కు బయలుదేరి వెళ్లి పర్యటనలో పాల్గొననున్నారు.
ఇక ముంబై కాంగ్రెస్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన రేవంత్…బిజెపి , బిఆర్ఎస్ పార్టీల పై విరుచుకపడ్డారు. ఆయన ఏమని మాట్లాడారంటే… మహారాష్ట్రలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ గ్యారెంటీల గురించి అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. మోడీ తన ప్రసంగాల్లో తెలంగాణ గురించి అనేక అబద్ధాలు చెబుతున్నారని, ఈ దుష్ప్రచారాన్ని ఆపకపోవడం వల్లే తాను నిజానిజాలను ప్రజలకు వివరించడానికి ముంబయికి వచ్చారన్నారు.
సోనియాగాంధీ 2023 సెప్టెంబర్ 17న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను, ఆమె ప్రణాళిక ప్రకారం అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని, గతంలో తెలంగాణలో కూడా రైతుల ఆత్మహత్యలు అధికంగా జరిగాయని చెప్పుకొచ్చారు. మోడీ సర్కార్ రైతుల సంక్షేమానికి సంబంధించిన చర్యలు తీసుకోకపోవడం వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎస్‌పీ (మినిమమ్ సపోర్ట్ ప్రైస్) అంశంలో కూడా ప్రధాని మోడీ ఏమీ చేయలేదని ఆరోపించారు. మోడీ ప్రభుత్వానికి నల్లచట్టాలు తెచ్చి, అదానీ మరియు అంబానీ లకు మేలు చేయడమే లక్ష్యమైందని అన్నారు.
తెలంగాణలో రైతుల కోసం రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని కాంగ్రెసు హామీ ఇచ్చిందని , కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 25 రోజుల్లో 22 లక్షల మందికి రూ.17,869 కోట్లు రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు. 10 సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ నిరుద్యోగులకు ఏమీ చేయలేదని కానీ కాంగ్రెసు ప్రభుత్వం 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చిందని వెల్లడించారు.
మహాలక్ష్మీ పథకం ద్వారా 1 కోటి మందికి పైగా మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారని , ఆర్టీసీకి రూ.3,541 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొన్నారు. 500 సిలిండర్ పథకం ద్వారా 49 లక్షల కుటుంబాలు లాభపడుతున్నాయని అన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ద్వారా 50 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయని , రైతులకు ఎంఎస్‌పీ కింద వడ్ల కొనుగోలు, రూ.500 బోనస్ ఇవ్వడం వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. మహారాష్ట్రలో B.J.P. నేతలు చేసిన అబద్ధాలు ప్రజలకు తెలియజేయడమే తన బాధ్యత అని రేవంత్ రెడ్డి తెలిపారు.
Read Also : IND vs SA: దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య రేపు రెండో టీ20.. పిచ్ రిపోర్ట్ ఇదే!