PM Surya Ghar Scheme : మహిళా సంఘాల సభ్యులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్
PM Surya Ghar Scheme : పీఎం సూర్యఘర్ పథకం (PM Surya Ghar Scheme) కింద మహిళలు తమ ఇళ్లపై సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా రేవంత్ సర్కార్ (Revanth Govt) ప్రతిష్టాత్మక ప్రణాళికను తీసుకొచ్చింది
- Author : Sudheer
Date : 03-06-2025 - 12:17 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలోని మహిళా సంఘాల సభ్యుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చక్కటి అవకాశాన్ని అందిస్తోంది. పీఎం సూర్యఘర్ పథకం (PM Surya Ghar Scheme) కింద మహిళలు తమ ఇళ్లపై సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా రేవంత్ సర్కార్ (Revanth Govt) ప్రతిష్టాత్మక ప్రణాళికను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా విద్యుత్ బిల్లుల భారం తగ్గింపు, అదనపు ఆదాయం పొందే అవకాశం, పర్యావరణ పరిరక్షణ మరియు పునరుత్పత్తి ఇంధనాన్ని ప్రోత్సహించాలనే ముఖ్య ఉద్దేశ్యాలను సాధించనుంది. ప్రతి ఏడాది లక్ష మంది మహిళలకు ఈ యూనిట్లు ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.
Turkey Earthquake : తెల్లవారుజామున టర్కీలో భూకంపం.. పరుగులు తీసిన జనం..
ఈ పథకంలో భాగంగా స్త్రీనిధి సమాఖ్య ద్వారా 4 శాతం వడ్డీతో రుణాలు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం రూ.78 వేలు వరకు సబ్సిడీ ఇస్తుండగా, మిగిలిన ఖర్చును మహిళలు రుణంగా తీసుకోవచ్చు. ఈ ప్లాంట్లు మూడు కిలోవాట్ల నుంచి ప్రారంభమై రూ.2 లక్షల వరకు ఖర్చవుతాయి. ఐదేళ్లలో రుణం పూర్తిగా తీర్చిన తర్వాత, మిగిలిన 20 సంవత్సరాల పాటు ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను విక్రయించి ఆదాయం పొందవచ్చు. ఈ విధంగా మహిళలకు దీర్ఘకాలికంగా ఆర్థిక స్థిరత్వం కలగనుంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు ఉండగా, వారిలో కనీసం 10 లక్షల మంది ఈ పథకం లబ్ధిదారులయ్యే అవకాశం ఉందని SERP గుర్తించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆమోదంతో ఇప్పటికే 32 జిల్లాల్లో 4 వేల సంఘాలతో ఒక్కో మెగావాట్ సామర్థ్యంతో ప్లాంట్లు ఏర్పాటు చేసే పనులు ప్రారంభం కావడం విశేషం. వీటి నిర్వహణను ప్రత్యేకంగా ఏర్పాటుచేసే సౌర విద్యుత్ విభాగం చూసుకుంటుంది. ఇది గ్రామీణ మహిళల జీవితాలలో ఆర్థిక స్వావలంబనను పెంపొందించేందుకు ముఖ్యమైన అడుగుగా భావించబడుతోంది.