UNIKA Book Launch : విద్యార్థి రాజకీయాలు రావాలి – సీఎం రేవంత్
UNIKA Book Launch : ముఖ్యమంత్రిగా ఒకే వేదికపై ఇంతమంది ప్రముఖులతో కలిసి ఉండటం ఆనందకరమని రేవంత్ అన్నారు
- By Sudheer Published Date - 03:47 PM, Sun - 12 January 25

విద్యార్థి దశలో సిద్ధాంతపరమైన భావజాలం తగ్గిపోవడం వల్లే రాజకీయాల్లో పార్టీ మార్పులు పెరుగుతున్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అభిప్రాయపడ్డారు. విద్యార్థి రాజకీయాలు సమాజానికి శక్తి, కొత్త నాయకత్వానికి దారి చూపుతాయని పేర్కొన్నారు. హైదరాబాద్ తాజ్ కృష్ణా హోటల్‌లో జరిగిన విద్యాసాగర్ రావు ఆత్మకథ “ఉనిక” పుస్తకావిష్కరణ(UNIKA Book Launch)లో ఈ విషయాలు తెలిపారు.
Sukesh Income : నా ఆదాయం రూ.7,640 కోట్లు.. పన్ను చెల్లిస్తా తీసుకోండి.. సుకేశ్ సంచలన లేఖ
ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఒడిశా గవర్నర్ కే. హరిబాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ఒకే వేదికపై ఇంతమంది ప్రముఖులతో కలిసి ఉండటం ఆనందకరమని రేవంత్ అన్నారు. విద్యాసాగర్ రావు సిద్ధాంతపరమైన నాయకత్వం భవిష్యత్ తరాలకు ఆదర్శమని ఆయన అభినందించారు. తెలంగాణ అభివృద్ధికి విద్యాసాగర్ రావు చేపట్టిన గోదావరి జలాల వినియోగ ఆలోచనలు పూర్తిగా అమలులోకి రావాలని కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తక్కువ ఖర్చుతో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడం అవసరమని తెలిపారు. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు కొత్త రీజనల్ రింగ్ లైన్ ప్రతిపాదనలు తీసుకురావడం పై ప్రధాని మోదీతో చర్చలు చేశామని పేర్కొన్నారు.
తెలంగాణలో ఆటోమొబైల్ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేయాలని సీఎం రేవంత్ తెలిపారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులను వేగవంతం చేయడం వల్ల ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పాటు కలుగుతుందని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి పనిచేస్తే తమిళనాడు మాదిరి అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఇక విద్యార్థి రాజకీయాలకు తిరిగి ప్రాధాన్యత ఇవ్వాలని, యువత సిద్ధాంతపరమైన ఆలోచనలతో రాజకీయాల్లో పాల్గొనడం సమాజ అభివృద్ధికి దోహదం చేస్తుందని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. విద్యార్థి దశలోనే ఉన్నతమైన ఆలోచనలను అభివృద్ధి చేస్తే, ఆగమ్య భావజాలంతో సమాజం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.