సమ్మక్క-సారలమ్మకు 68 కేజీల బంగారాన్ని సమర్పించిన సీఎం రేవంత్
తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో భాగంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలను దర్శించుకున్నారు
- Author : Sudheer
Date : 19-01-2026 - 8:54 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో భాగంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలను దర్శించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు ఇది తొలి మేడారం పర్యటన కావడం విశేషం. ఈ సందర్భంగా అమ్మవార్లకు ఆయన తొలి మొక్కును సమర్పించారు. గద్దెలపైకి చేరుకున్న సీఎం, అమ్మవార్ల ఆశీస్సులు తీసుకుని, రాష్ట్ర ప్రజలందరికీ శుభం కలగాలని ప్రార్థించారు. ఈ పర్యటనలో ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Revanth Medaram Visit
జాతర ప్రాంగణానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, తొలుత అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్‌ను మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం ఆధునికీకరించిన గద్దెల ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు. మేడారానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. గద్దెల ఆధునికీకరణ పనుల ద్వారా భక్తులు మరింత సులభంగా అమ్మవార్లను దర్శించుకునే వీలు కలుగుతుందని ఈ సందర్భంగా సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే తన మనవడితో కలిసి తులాభారంలో పాల్గొని మొక్కు తీర్చుకున్నారు. తన బరువుకు సమానంగా (సుమారు 68 కేజీల) ‘బంగారాన్ని’ (బెల్లం) వనదేవతలకు నైవేద్యంగా సమర్పించారు. గిరిజన సంప్రదాయం ప్రకారం బెల్లాన్ని బంగారంలా భావించి సమర్పించడం మేడారం జాతరలో ముఖ్యమైన ఆచారం. తన కుటుంబంతో కలిసి ఈ మొక్కు తీర్చుకోవడం ద్వారా ఆయన ఆచారాలకు ఉన్న ప్రాముఖ్యతను చాటారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ వంటి వారు దగ్గరుండి పూజా కార్యక్రమాలను పర్యవేక్షించగా, మేడారం పరిసర ప్రాంతాలు భక్తజన సందోహంతో కోలాహలంగా మారాయి.