CM Revanth : విమానంలో సాధారణ ప్రయాణికుడిలా సీఎం రేవంత్
CM Revanth : శంషాబాద్ విమానాశ్రయం నుంచి రేవంత్ ఢిల్లీ (Delhi) వెళ్లారు. ఓ సాధారణ ప్రయాణికుడిలా ఎకానమీ క్లాస్లో అందరితో కలిసి ఆయన ప్రయాణించారు
- By Sudheer Published Date - 10:01 AM, Wed - 16 July 25

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) తన సింప్లీసిటీతో ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు. ఆ మధ్య తన కాన్వాయ్ వల్ల వాహనదారులకు ఇబ్బంది కలగకూడదని.. తన కోసం ట్రాఫిక్ ఆపేయకండంటూ పోలీసులకు ఆదేశాలు ఇచ్చి వార్తల్లో నిలువగా..తాజాగానిన్న శంషాబాద్ విమానాశ్రయం నుంచి రేవంత్ ఢిల్లీ (Delhi) వెళ్లారు. ఓ సాధారణ ప్రయాణికుడిలా ఎకానమీ క్లాస్లో అందరితో కలిసి ఆయన ప్రయాణించారు.
సీఎంను విమానంలో చూసిన ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లలేదు. ఓ సాధారణ వ్యక్తిలా ప్యాసింజర్ ఫ్లైట్‌లో జనాలతో కలిసే హస్తినకు వెళ్లటం విశేషం. ఈ విషయాలన్ని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటూ.. ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అధికారం అంటే హంగు, ఆర్భాటం కాదు.. అధికారం అంటే భారీ కాన్వాయ్, స్పెషల్ ఫ్లైట్ సోకులు కాదు.. అధికారం అంటే బాధ్యత, సామాన్యుడి సేవ.. అని రేవంత్ రెడ్డి నిరూపిస్తున్నారని ఆయన అభిమానులు పోస్టులు పెడుతున్నారు. దటీజ్ రేవంతన్న అంటూ జై కొడుతున్నారు.
ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో పోలవరం-బనకచర్ల నీటి వివాదంపై సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. శ్రమశక్తి భవన్ వేదికగా మధ్యాహ్నం 2.30కి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. రెండు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీలోనే ఉండటం, చర్చను మొదట వ్యతిరేకించిన తెలంగాణ ప్రభుత్వం చివరికి సమావేశానికి వెళ్తున్నట్లు సంకేతాలిచ్చిన నేపథ్యంలో, ఈ సమావేశం దక్షిణాది రాష్ట్రాల నీటి వ్యవహారాల్లో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది.