Ration Card Link For Runa Mafi : పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ – సీఎం రేవంత్
ఎల్లుండి సాయంత్రంలోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని , అదే రోజు రైతు వేదికల్లో సంబరాలు ఉంటాయని, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని పిలుపునిచ్చారు
- By Sudheer Published Date - 07:36 PM, Tue - 16 July 24

తెలంగాణ సర్కార్ ఎప్పుడెప్పుడు రైతు రుణమాఫీ (Rythu Runa Mafi) చేస్తుందా అని రైతులంతా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారు. కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు రెండు లక్షల రుణమాఫీ చేసేందుకు సిద్ధమైంది. ఆగస్టు 15 లోగా రైతుల రుణమాఫీ చేస్తామని..ఎన్ని అడ్డంకులు వచ్చిన తగ్గే ప్రసక్తి లేదని..చెప్పినట్లే చేసి రైతుల ఋణం తీర్చుకుంటామని పదే పదే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఇప్పుడు చెప్పినట్లే రుణమాఫీ చేస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2.00 లక్షల వరకు పంట రుణ మాఫీ వర్తిస్తుంది. కేంద్ర బ్యాంకులు, బ్రాంచ్‌ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. 12-12-2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేదా రెన్యువల్ అయిన రుణాలకు, 09-12-2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. 09-12-2023 వరకు బకాయి ఉన్న అసలు, వడ్డీ మొత్తం రుణ మాఫీ పథకానికి అర్హత కలిగి ఉంటుందంటూ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. అయినప్పటికీ రైతుల్లో మాత్రం అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పాన్ కార్డు ఉన్నవారికి రుణమాఫీ జరగదు..రేషన్ కార్డు లేనివారికి రుణమాఫీ కాదు..ఐటీ కట్టేవారికి రుణమాఫీ చేయరు..ఇలా అనేక రకాల ప్రచారం జరుగుతుండడం తో రైతుల్లో ఆందోళన పెరుగుతుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ వాటిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
పాస్ బుక్ ఆధారంగానే రైతులకు రూ.2లక్షల మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రైతు కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన పెట్టినట్లు కలెక్టర్ల సదస్సులో ఆయన వెల్లడించారు. ఈ నెల 18న రూ. లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎల్లుండి సాయంత్రంలోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని , అదే రోజు రైతు వేదికల్లో సంబరాలు ఉంటాయని, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే ఎల్లుండి నుంచి జమ చేసే రైతు రుణమాఫీ డబ్బులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రుణమాఫీ నిధులను ఇతర ఖాతాల్లో జమ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సీఎం రేవంత్ క్లారిటీ తో సదరు రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ..అనుమానాలన్నీ తొలిగిపోయాయని అంటున్నారు.
Read Also : Kerala: గర్భిణిపై చేయి చేసుకున్న సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అనుచరులు