Telangana Sentiment : 2023 ఎన్నికల్లోనూ అదే బూచి.!
ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకోవడంలో కేసీఆర్ అపరచాణక్యుడు.
- By CS Rao Published Date - 12:51 PM, Wed - 9 February 22

ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకోవడంలో కేసీఆర్ అపరచాణక్యుడు. అందొచ్చిన ఏ అవకాశాన్ని కేసీఆర్ వదులుకోడు. పార్లమెంట్ వేదికగా ప్రధాని మోడీ చేసిన రాష్ట్ర విభజన అంశాన్ని సెంటిమెంట్ కిందకు లాగుతున్నాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచేలా మాట్లాడాడనే కోణం నుంచి తీసుకెళుతున్నాడు. అందుకోసం తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు, దిష్టిబొమ్మల దగ్ధం లాంటి కార్యక్రమాలకు పిలుపు ఇచ్చాడు. అంతేకాదు, పార్లమెంట్లో మోడీపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు.రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ అహంకారంతో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని విడదీసిందని ప్రధానంగా మోడీ చేసిన కామెంట్. అంతేకాదు, ఏపీకి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ఆరోపించాడు. పార్లమెంట్ తలుపులుమూసి, పెప్పర్ స్ర్పే చల్లడం ద్వారా విభజన బిల్లును ఆమోదించడం ప్రజాస్వామ్యమా? అంటూ ప్రశ్నించాడు. తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే రాష్ట్ర విభజన జరిగిన తీరును మోడీ అభ్యంతరపెట్టాడు. సరిగ్గా, ఇక్కడే తెలంగాణ సెంటిమెంట్ రేగింది. రాష్ట్రం విడిపోవడాన్ని మోడీ వ్యతిరేకిస్తున్నాడంటూ టీఆర్ఎస్ శ్రేణులు టామ్ టామ్ చేస్తున్నారు. మొదటి నుంచి తెలంగాణ వ్యతిరేకిగా మోడీ ఉన్నాడని కల్వకుంట్ల ఫ్యామిలీ మూకుమ్మడితో దాడికి దిగింది. గులాబీ శ్రేణులను రంగంలోకి దింపడం ద్వారా క్షేత్రస్థాయిలో బీజేపీని పలుచన చేయడానికి సిద్ధం అయింది. ఇటీవల ఆ పార్టీ పుంజుకుందని ప్రజల్లోకి బలంగా వెళ్లింది. తాజాగా మోడీ చేసిన కామెంట్స్ ను అస్త్రంగా చేసుకుని బీజేపీని చావుదెబ్బ తీయాలని కేసీఆర్ ప్లాన్ చేశాడు.
తెలంగాణ సెంటిమెంట్ ను అనుకూలంగా మలుచుకోవడంలో కేసీఆర్ దిట్ట. రాష్ట్రం విడిపోయిన తరువాత 2014, 2018 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి బాగా పనిచేసింది. విభజన జరిగిన తొలి ఏడాది (2014లో )జరిగిన ఎన్నికల్లో 63 స్థానాలను మాత్రమే టీఆర్ఎస్ కైవసం చేసుకోగలిగింది. రెండోసారి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును (ఆంధ్రా ) బూచిగా చూపి 88 మంది ఎమ్మెల్యేలను గెలిచి అధికారంలోకి కేసీఆర్ వచ్చాడు. ఇటీవల జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలను చూపుతూ బీజేపీ దూకుడు పెంచింది. దీంతో ఉక్కిరిబిక్కిరి అయిన కేసీఆర్ ఆ పార్టీపై తీవ్రంగా దాడికి దిగాడు. ప్రతిగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఏ మాత్రం తగ్గకుండా మాటకు మాట, తిట్టుకు తిట్టు ప్రయోగిస్తూ తెలంగాణ రాజకీయాన్ని హీటెక్కించారు. మోడీ వ్యాఖ్యలతో బీజేపీ మీద పైచేయి సాధించడానికి గులాబీ శ్రేణులు ముందుకదలాయి.
వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ త్యాగం చేసి తెలంగాణను ఇచ్చింది. రాజ్యాధికారం దగ్గరకు వచ్చే సమయానికి కేసీఆర్ హైజాక్ చేశాడు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే, టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కేసీఆర్ ఆనాడు హామీ ఇచ్చాడని ఢిల్లీ వర్గాలకు తెలుసు. తీరా,రాష్ట్రం ప్రకటించిన తరువాత సోనియాగాంధీని తెలంగాణ దెయ్యం అంటూ స్లోగన్ అందుకున్నాడు. తన నిరాహారదీక్ష కారణంగానే తెలంగాణ ఏర్పడిందని ప్రజల్లోకి వెళ్లాడు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ శత్రువుగా చూపించాడు. ఫలితంగా కాంగ్రెస్ తెలంగాణ లో అధికారంలోకి రాలేకపోవడంతో పాటు బలహీనపడింది. ఏపీ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విడదీసింది. దీంతో అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేకుండా చేశారు. ఇదే విషయాన్ని మోడీ ప్రస్తావించాడు.అధికార అహంకారం, దాహంతో అశాస్త్రీయంగా ఏపీని విడదీశారని పార్లమెంట్ వేదికగా మోడీ చేసిన కామెంట్ సెంటిమెంట్ రూపంలోకి కేసీఆర్ మలిచాడు. ఈసారి జరిగే ఎన్నికల వరకు ఇదే అంశాన్ని బలంగా తీసుకెళ్లడం ద్వారా మూడోసారి సీఎం కావాలని భారీ ప్రణాళికను కేసీఆర్ రచించాడని ఆ పార్టీ వర్గాల ఆందోళనల ఆధారంగా అర్థం అవుతోంది. సో..2014,2018లో తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మళ్లీ దాన్నే నమ్మకున్నాడు. ఈసారి మోడీ( ఆంధ్రా )ని బూచిగా చూపించి 2023 ఎన్నికలకు వెళ్లడానికి కేసీఆర్ సిద్ధమయ్యాడన్నమాట.