KCR Praises Rahul Gandhi: రాహుల్ భజనలో కేసీఆర్
రాహుల్ గాంధీకి రక్షణ కవచంగా తెలంగాణ సిఎం కేసీఆర్ మారుతున్నాడు. జాతీయ రాజకీయాల్లో అరంగ్రేటాన్ని జనగామ సభలో ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆతరువాత
- By Balu J Published Date - 08:25 PM, Sun - 13 February 22

రాహుల్ గాంధీకి రక్షణ కవచంగా తెలంగాణ సిఎం కేసీఆర్ మారుతున్నాడు. జాతీయ రాజకీయాల్లో అరంగ్రేటాన్ని జనగామ సభలో ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆతరువాత యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన సభతో వడివడిగా అడుగులు వేయడం ప్రారంభించారు. రాజకీయ పథకాన్ని ప్రణాళికబద్ధంగా తెలంగాణ ప్రజల ముందు జాగ్రత్తగా పెడుతున్నారు. జాతీయ రాజకీయాల్లోకి అడుగిడేందుకు అనువైన వాతావరణాన్ని ఏర్పరుచుకుంటున్నారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఇతర రాజకీయ పక్షాలను అకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ కేంద్రంగా భవిష్యత్ జాతీయ రాజకీయాలుండే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణ నేల మీది నుంచి కేంద్ర ఆధిపత్య రాజకీయాలను ఎదుర్కొనే నేతగా తనను మార్చుకుంటున్నారు. జాతీయ నేతగా ప్రతిష్ఠించుకునేందుకు వీలైన అన్ని దారులను కేసీఆర్ తెరుస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ముఖ్యంగా మూడు అంశాల పై కేంద్రీకరించారు. మోడీ సర్కారు వైఫల్యాలపై విమర్శలు చేపట్టారు. కేంద్ర మంత్రుల అవినీతిని చిట్టా తన వద్ద ఉందంటూ తన ‘రక్షణ’తో పాటు ఎదుటి పక్షంపై దాడికి సిద్ధమయ్యారు. బీజేపీ మతపిచ్చిపై మండిపడుతూ హిందూ ధర్మం ఇది చెప్పిందా? అంటూ ప్రశ్నించడం గమనార్హం. కాంగ్రెస్ నేత రాహుల్‌కు మద్దతు తెలియజేస్తూ మాట్లాడడం ప్రత్యేకాంశం.
జనామోద జనగామ సభ
ప్రత్యేక రాజకీయ వాతావరణంలో… ఆగమేఘాల మీద జనగామలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను లోతుగా పరిశీలిస్తే ఈ విషయాలన్నీ స్పష్టమవుతాయి. ఒక విధంగా కేసీఆర్ జాతీయ రాజకీయ రంగ ప్రవేశానికి జనగామ సభను ‘జనామోద సభ’గా భావించాల్సి ఉంటుంది. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రతిపాదన రూపంలో ప్రకటించిన బీజ రూప ‘ఫెడరల్ ఫ్రంట్’ఈ మూడున్నరేళ్ళుగా ‘కేసీఆర్ ఫ్రంట్’లో అనేక రూపాంతరాలు చెందుతూ ప్రాణం పోసుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ రూపానికి రాజకీయ వేదికగా రాష్ట్రాన్ని మార్చేందుకు వీలుగా జనగామ గడ్డ నుంచి ఆయన జాతీయ రాజకీయాలకు సిద్ధమైన నిర్ణయాన్ని ప్రకటిస్తూ జనామోదాన్ని పొందేందుకు యత్నించారు.
ప్రజల ముందు అభివృద్ధి నమూనా
తెలంగాణ ఉద్యమం చేపట్టిన అప్పటి పోరాట నేపథ్యాన్ని గుర్తు చేస్తూ రాష్ట్రసాధన, అభివృద్ధి అంశాలను ఉదహరించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను పునరుద్ధరించేందుకు మళ్ళీ ప్రయత్నించారు. తన యేలుబడిలో ఈ రాష్ట్రాన్ని ‘ఉద్దరించిన’ విధానాన్ని తెలియజేస్తూ ఈ ప్రాంతం అండగా దేశరాజకీయాల్లో తన ‘పాత్ర’ పోషించేందుకు ముందుకు సాగనున్నట్లు ప్రకటించారు. పోల్చుకునేందుకు వీలుగా రాష్ట్రాభివృద్ధికి చేపట్టిన సంక్షేమ పథకాల ఫలాల దృశ్యాన్ని ప్రజల ముందుంచారు. ఇదే సందేశాన్ని జాతీయ స్థాయిలో కేసీఆర్ అందించే ప్రయత్నం చేశారు. నిధులు ఇవ్వకున్నా తనదైన ‘ అభివృద్ధి, సంక్షేమ నమూనా’ను దేశం ముందించేందుకు ప్రయత్నించారు.
రాష్ట్ర అభివృద్ధికి మోడీ అడ్డంకి
మరోవైపు జాతీయ రాజకీయాలంటే కేంద్రాన్ని ఢీకొనే శక్తి తనకుందనే ‘నమ్మకాన్ని’ ఎంత కలిగిస్తే అంత అనుకూల పరిస్థితులు, విశ్వాసం దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఏర్పడుతుంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే రాష్ట్రంలో తమ నేత పాత్ర లేదనే సందేహం, బెంగ తలెత్తకుండా తన పాత్రను మరో రూపంలో చేపట్టాల్సిన కర్తవ్యం మనముందుందని ప్రజలచే ఒప్పించే ప్రయత్నం చేశారు. రానున్న రోజుల్లో ఇక్కడ ఉండే తన వారసత్వ సర్కారుకు ఎలాంటి ఢోకా లేకుండా రక్షణ కవచంలా ఉంటుందనే ముందు జాగ్రత సైతం ఇందులో దాగి ఉంది. ఈ కారణాల రీత్యానే కేసీఆర్ రాష్ట్రానికి కేంద్రం ఏ విధంగా అన్యాయం చేస్తుందనే తీరులో ఏకరువుపెట్టారు. ముఖ్యంగా విద్యుత్ సంస్కరణల పేరుతో మోటార్లకు మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తుంటే తాను ఎలా అడ్డుపడుతుందోనని చెప్పారు. ఈ ఎనిమిదేళ్ళలో ఎంత అభివృద్ధి చేశామో వివరించే ప్రయత్నం చేస్తూనే ఈ అభివృద్ధికి కేంద్రం అడ్డుగోడగా నిలుస్తుందని, మెడికల్ కాలేజీలు ఇవ్వడంలేదని, నిధులివ్వడంలేదంటూ, సమస్యలు సృష్టిస్తుందని ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. కేంద్రం వైఖరిని విమర్శిస్తూనే మనమే కేంద్రంలో తగిన భూమిక పోషిస్తే రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతుందని, మనం దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన తరుణం ఆసన్నమైందని ప్రజలను మానసికంగా సంసిద్ధం చేసే ప్రయత్నం చేశారు.
ఉద్యమ ఎత్తుగడకు పదును
ఇదే ఊపులో కేసీఆర్ మాట్లాడుతూ కేంద్రంలో బలమైన నేతగా ఉన్న మోఢీని ఢీకొడుతానంటూ ఢిల్లీకోటను బద్దలు కొట్టేందుకు ఇక్కడి నుంచి బయలుదేరి దేశ రాజకీయాల్లో పాత్ర పోషించుదాం అంటూ అంగీకారాన్ని తీసుకున్నారు. తెలంగాణను కొట్టాడితెచ్చుకున్నం, యుద్ధం చేసిన పార్టీ అంటూ ‘జాగ్రత్త నరేంద్రమోడీ’ తెలంగాణ పులిబిడ్డ మీ ఉడుత ఊపులకు, పిట్టబెదిరింపులకు భయపడమంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక తమ పార్టీ జోలికి బీజేపీ వస్తే నశం చేస్తాం బిడ్డలారా అంటూ బహిరంగహెచ్చరిక చేయడం గమనార్హం. ఎనిమిదేళ్ల పాలన ఫలితంగా రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఇవి మరింత పెరుగుతాయనడంలో సందేహం లేదు. ఈ కారణంగా కేంద్రంలో, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ పుంజుకుని అధికారంలోకి రాకుండా చేయడంలో మోడీ, కేసీఆర్ ఇద్దరి లక్ష్యమొక్కటే. ఈ ముందస్తు జాగ్రత్తలో భాగంగా కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా కేంద్రంలో మరో పార్టీయో, కూటమినో ముందుకు తీసుకరావాల్సిన అవసరం మోడీ కున్నది. అలా అని ఆ కూటమి, పార్టీ బీజేపీ ప్రత్యామ్నాయంగా మారకూడదు ఇది మోడీ ఆలోచన. ఇదే తరహాలో రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుని అధికారంలోకి రాకూడదు. అలాగని బీజేపీ ప్రత్యామ్నాయంగా ముందుకు రాకూడదు. ఇది కేసీఆర్ ఆలోచన. ఈ పరస్పర లక్ష్యంలో తేడా రాకుండా జాగ్రత వహిస్తున్నాయి. అదే సమయంలో ఒకరికొకరు పోటీ కావడం కూడా ఇద్దరికీ ఇష్టం లేదు. అందుకే అంతర్గత స్నేహం, బహిరంగ విమర్శలు వ్యక్తం చేసుకుంటున్నారని వీరిద్దరి వ్యవహార శైలిని పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఎంతకాలమీ ఎత్తులు పై ఎత్తులు?
బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య ఈ స్నేహం ఇలాగే కొనసాగాలనేదానికి ఏం కండీషన్ లేదు. ఏడున్నరేళ్ళ స్నేహం ఇటీవల విమర్శల స్థాయికి చేరింది. ఇపుడు స్వరం మారింది. ఇదిలా ఉండగా తమ అధికార, రాజకీయ అవసరాల రీత్యా ఎలాంటి రూపాన్నైనా మార్చగల నేర్పరితనం కేసీఆర్కున్నది. అందువల్ల కేసీఆర్ ఎత్తుగడలకు రెండు వైపులా పదును ఉందనేది అంటున్నారు. ఏమైనా ఇది రెండు పార్టీల పరస్పర ఆధారిత అంశం. కేసీఆర్ తనకు నష్టం జరిగే విషయాలను అంగీకరించే అవకాశం లేదు. మోడీకి నష్టం వాటిల్లే ప్రయత్నాలను ఆయన కూడా ఒప్పుకోరు. ఎవరికి వారు తమ పార్టీ పట్టు సడలిపోకుండా, అదే సందర్భంలో మరింత పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందుకే తాజా పరిణామాలను చూసి రాజకీయ చదరంగంలో ఎత్తులు పై ఎత్తులుగా రాజకీయ అనువభజ్ఞులు అభివర్ణిస్తున్నారు. జనగామలో కేవలం జాతీయ రంగ రాజకీయ ప్రవేశానికి పరిమితమై మాట్లాడిన కేసీఆర్ భువనగిరి వేదిక నుంచి దేశరాజకీయాలు కేంద్రంగా జాతీయ నేతగా తన రూపాన్ని మార్చుకుంటూ మరో కోణాన్ని ప్రదర్శించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీనిలో భాగంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ మాట్లాడిన దానికి ప్రతిగా అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడిన ‘రాహుల్ నీ తండ్రి ఎవరో ముందు తెలుసుకో’ అంటూ మాట్లాడడమేమిటంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదా? బీజేపీ నేతల తీరు, ఇదా హిందూ సంస్కారమంటూ విరుచుకపడ్డారు. ఉన్నట్లుండి కాంగ్రెస్ నేత రాహుల్ పై సానుభూతి వ్యక్తం చేస్తూ మాట్లాడడంలో కేసీఆర్ రాజకీయ చతురత ఉందా? జాతీయ రాజకీయాల్లో అడుగిడుతున్నందున ఈ అంశాన్ని లేవనెత్తారా? కాంగ్రెస్‌కు స్నేహ హస్తమేమైనా అందించే యత్నం చేస్తున్నారా? అనే ప్రశ్నలు ముసురుకుంటున్నాయి. ముఖ్యమంత్రులు మమతాబెనర్జీ, ఉద్దవ్‌ఠాక్రే, స్టాలిన్‌లతో సంబంధాలు కొనసాగిస్తున్నామంటూ భవిష్యత్ కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రకటించారు.
తొలిసారి కర్నాటకలో ‘హిజాబ్’ అంశం పై స్పందిస్తూ సిలికాన్ వ్యాలీని కాశ్మీర్వ్యాలీ చేస్తారా? బీజేపీకి మతపిచ్చిపట్టుకుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై ప్రధాని మోడీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలను ఎత్తి చూపుతూ తెలంగాణతో గొక్కుంటే సహించేదిలేదంటూ స్పష్టం చేశారు. ఎనిమిదేళ్ళ బీజేపీ స్నేహంపై సందేహాలు తలెత్తకుండా దశలవారీ బ్రెయిన్‌వాష్ ప్రారంభించారు. తెలంగాణ అనుకూల, టీఆర్ఎస్ శ్రేణులకు బహిరంగ రాజకీయ అవగాహన అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి నుంచి కేసీఆర్ ఎజెండాలో దేశరాజకీయాలు, రాష్ట్ర ప్రయోజనాలు అనే అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం కన్పించనున్నది. ప్రాంతీయ నేత నుంచి జాతీయ నేతగా రూపాంతరం చెందినట్లు తేడా ఉండే విధంగా జాగ్రత్త వహించనున్నారు. అందుకే రాహుల్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత మరింత దూకుడు తో పాటు రాహుల్ ని కూడా నేరుగా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.