Rajasingh : పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్‌ఎస్‌తో కలిసిపోతారు : రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
బీజేపీ అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేయాలో నిర్ణయించేది వారు కాదు, ఇతర పార్టీలు డిసైడ్ చేస్తారు. గతంలోనూ ఇదే జరిగింది. దీనివల్లే మేము రాజకీయంగా నష్టపోయాం.
- By Latha Suma Published Date - 02:53 PM, Thu - 29 May 25

Rajasingh : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించే వ్యాఖ్యలు చేశారు బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఆఫ్ ద రికార్డ్‌లో బీఆర్ఎస్ నేత కవిత చేసిన వ్యాఖ్యలు నిజమేనని ఆయన మన్నుకున్నారు. పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్‌ఎస్‌తో కలిసిపోతారు అని రాజాసింగ్ ఆరోపించారు. పార్టీకి ఇది తీవ్ర నష్టాన్ని కలిగించిందని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేయాలో నిర్ణయించేది వారు కాదు, ఇతర పార్టీలు డిసైడ్ చేస్తారు. గతంలోనూ ఇదే జరిగింది. దీనివల్లే మేము రాజకీయంగా నష్టపోయాం. ప్రతి ఎన్నికల్లోనూ మా సొంత నాయకులే ఇతర పార్టీలతో కుమ్మక్కవుతున్నారు. ఇది ఓపెన్ సీక్రెట్‌గా మారిపోయింది అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
Read Also: Pakistan Nuclear Test : పాక్ అణుపరీక్షల వార్షికోత్సవాల్లో ఉగ్రవాదులు
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఇప్పటివరకు అధికారంలోకి రాకపోవడానికి ఇదే ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ఆత్మపరిశీలన చేసుకునే సమయం. వాస్తవానికి బీజేపీ చాలా కాలం కిందటే రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సింది. కానీ మా నాయకులే ఇతర పార్టీల చేతుల్లోకి వెళ్లడం, బలహీనంగా వ్యవహరించడం వల్లే ప్రజల్లో విశ్వాసం కలగడం లేదు అని ఆయన పేర్కొన్నారు. పార్టీలో కొన్ని అసలు సమస్యలను స్వయంగా పార్టీ నేతలే పరిష్కరించకుండా, ఇతర పార్టీలతో ‘సైలెంట్ డీల్స్’ చేసుకుంటున్నారని విమర్శించారు. ఈ స్థితిలో బీజేపీ ఎలా బలపడగలదో అందరికీ ప్రశ్నగా మిగిలిందన్నారు. పార్టీ స్థాయిలో మార్పులు రావాలంటే లోపాలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీజేపీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు, నాయకుల మధ్య అనుమానాలు మళ్లీ తెరపైకి వచ్చాయని భావిస్తున్నారు విశ్లేషకులు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ ఎలా స్పందిస్తుందో, పార్టీ స్థాయిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సిందే.
Read Also: Bhatti Vikramarka : భూభారతి అమలుకు సిద్ధం అవుతున్నాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క