BJP: అదిరేటి ట్వీట్.. వడ్లు, గోధుమకు తేడా తెల్వదా?
తెలంగాణలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ వరి ధాన్యం కొనుగోళ్ల విషయమై ధర్నా, ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది.
- By Balu J Published Date - 05:34 PM, Mon - 11 April 22

తెలంగాణలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ వరి ధాన్యం కొనుగోళ్ల విషయమై ధర్నా, ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని పలు చోట్లా వరిధాన్యం, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫొటోలను ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీలు వరికి బదులుగా గోధుమ పంటకు సంబంధించిన ఫొటోలు ఏర్పాటు చేయించారు. దీంతో ఈ ఫ్లెక్సీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద బీజేపీ రాష్ట్ర శాఖ నిరసన తెలుపుతుండగా, తెలంగాణ అధికార పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ ఢిల్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎదురుదాడికి దిగింది. ఇందిరాపార్క్ వద్ద నిరసనకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వి.మురళీధరన్‌ను ఆహ్వానించారు.
అందుకు అనుగుణంగా నగరంలోని పలు చోట్ల, పార్టీ ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేసింది. అయితే ఫ్లెక్సీలలో వరి బదులు గోధుమల ఫొటోలను ఉపయోగించడం పట్ల బిజెపి ట్రోల్స్ గురికావాల్సి వచ్చింది. “వరి నిరసన కోసం బిజెపి అధ్యక్షుడు గోధుమ పంటకు సంబంధిన ఫొటోలతో నిరసనకు దిగారు’’ అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. “వారికి గోధుమలు, వరి మధ్య తేడా కూడా తెలియదు” అని మరికొంతమంది ట్వీట్ చేశారు. “అమర్‌సింగ్ కార్వాన్ ఎమ్మెల్యేగా గెలుస్తారో ఊహించుకోండి. ఆయనకు బియ్యం, గోధుమల మధ్య తేడా లేదు. బతకడానికి గడ్డి తింటున్నట్లుంది‘‘ ఇంకొంతమంది ట్రోల్స్ కు దిగారు.