Goshamahal Constituency : గోషామహల్ సీటు నాదే అంటున్న విక్రమ్ గౌడ్.. మరి రాజాసింగ్ పరిస్థితి ఏంటి?
తాజాగా రానున్న ఎన్నికల్లో బీజేపీ నుండే గోషామహల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తాను అని బీజేపీ నేత విక్రమ్ గౌడ్(Vikram Goud) అన్నారు.
- Author : News Desk
Date : 21-07-2023 - 8:27 IST
Published By : Hashtagu Telugu Desk
గత రెండు ఎలక్షన్స్ లోను గోషామహల్(Goshamahal Constituency) నుంచి బీజేపీ(BJP) తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రాజాసింగ్(Raja Singh). కానీ తన వ్యాఖ్యలు, పనులతో ఇటీవలే కొన్నాళ్ల క్రితం పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో గోషామహల్ లో బీజేపీ నుంచి ఎవరికి టికెట్ ఇస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల ఈటల రాజాసింగ్ తో మాట్లాడటంతో మళ్ళీ గోషామహల్ నుంచి అతనే పోటీ చేస్తాడేమో, ఎన్నికల ముందు సస్పెన్షన్ ఎత్తివేస్తారేమో అని వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా రానున్న ఎన్నికల్లో బీజేపీ నుండే గోషామహల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తాను అని బీజేపీ నేత విక్రమ్ గౌడ్(Vikram Goud) అన్నారు. విక్రమ్ గౌడ్ నేడు మీడియాతో మాట్లాడుతూ.. మా కుటుంబానికి గోషామహల్ నియోజకవర్గ ప్రజలతో 40 ఏళ్ల అనుబంధం ఉంది. రాజాసింగ్ పై పెట్టిన సస్పెన్షన్ కేంద్ర అధిష్టానం పరిధిలో ఉంది. ఆయన సేవలు కూడా పార్టీకి అవసరం కాబట్టి ఆ దిశగా అధిష్టానం చర్యలు తీసుకుంటుంది. నేను ఈసారి గోషామహల్ నియోజకవర్గం నుండే పోటీ చేస్తాను. రాజాసింగ్ ఇంటికి వెళ్లి ఆయన మద్దతు కూడా కోరతాను అని అన్నారు. దీంతో విక్రమ్ గౌడ్ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతని సంతరించుకున్నాయి.
మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్. ప్రస్తుతం గోషామహల్ లో యాక్టివ్ లీడర్ గా ఉన్నాడు. నేడు విక్రమ్ గౌడ్ తో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. MJ మార్కెట్ లోని విక్రమ్ గౌడ్ నివాసంలో ఈటల ఇవాళ భోజనానికి కలిశారు. గోషామహల్ నియోజకవర్గంలో తాజా రాజకీయాలపై చర్చించారు. అయితే ఈటల మొన్న రాజసింగ్ ని, ఈ రోజు విక్రమ్ గౌడ్ ని కలవడంపై గోషామహల్ రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. మరి వచ్చే ఎన్నికల్లో గోషామహల్ లో బీజేపీ నుంచి ఎవరు పోటీచేస్తారో చూడాలి.
Also Read : MLC Kavitha: నిజామాబాద్ ఐటీ హబ్.. యువత ఉజ్వల భవిష్యత్తుకు బాట!