TPCC President: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు శుభాకాంక్షలు: టీపీసీసీ అధ్యక్షులు
బీసీ సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ పోరాట నేత విజయశాంతికి టికెట్ ఇవ్వడంతో బీసీ, మహిళకు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుందని, పొత్తు ధర్మంలో భాగంగా ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించడం జరిగిందని అన్నారు.
- By Gopichand Published Date - 08:38 PM, Sun - 9 March 25

TPCC President: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు టీపీసీసీ అధ్యక్షులు (TPCC President) మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం అన్ని కోణాలలో ఆలోచించి అభ్యర్థుల ఎంపిక చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, విజయశాంతిలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గత 30 ఏళ్లుగా పార్టీకి నిబద్ధతతో పని చేస్తున్న ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నాయక్‌కు అవకాశం ఇవ్వడంతో కార్యకర్తల పార్టీ భరోసా ఇచ్చింది.
అలాగే 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలకంగా పని చేస్తూ తెలంగాణ ఉద్యమ కారుడిగా పేరున్న అద్దంకి దయాకర్ రెండు సార్లు తక్కువ ఓట్లతో ఓడిపోయిన నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు చేశారని, కాంగ్రెస్ పార్టీ గొంతుకగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేశారని టీపీసీసీ అధ్యక్షులు అన్నారు. అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తుందని అన్నారు.
Also Read: Chahal With Secret Girl: విడాకుల తర్వాత ‘మిస్టరీ గర్ల్’తో కనిపించిన చాహల్.. ఫోటో వైరల్!
బీసీ సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ పోరాట నేత విజయశాంతికి టికెట్ ఇవ్వడంతో బీసీ, మహిళకు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుందని, పొత్తు ధర్మంలో భాగంగా ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించడం జరిగిందని అన్నారు. రేపు అసెంబ్లీలో కాంగ్రెస్, సీపీఐ అభ్యర్థులు నామినేషన్ వేస్తారని ఆయన వివరించారు.
ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోస్టుల భర్తీ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే దీనిపై ముఖ్య ప్రకటన వెలువరించారు. తెలంగాణ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల బలం ప్రకారం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కుతాయి. వీటిలో ఒక దాన్ని సీపీఐ పార్టీకి కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇక మిగతా మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులుగా కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, విజయశాంతి, కేతావత్ శంకర్ నాయక్‌ల పేర్లను ఖరారు చేసింది. ఈ మేరకు వివరాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.