Bathukamma: ఈనెల 21 నుంచి బతుకమ్మ సంబరాలు.. ఏ రోజు ఏ బతుకమ్మ?
ఈ పండుగ తెలంగాణ సంస్కృతి, ప్రకృతి ఆరాధన, ఆడపడుచుల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ తొమ్మిది రోజులు తెలంగాణ పల్లెలు, పట్టణాలు పండుగ శోభతో కళకళలాడతాయి.
- By Gopichand Published Date - 07:23 PM, Fri - 5 September 25

Bathukamma: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ (Bathukamma) పండుగ సంబరాలు ఈ ఏడాది సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పూల పండుగ కోసం తెలంగాణ ఆడపడుచులు ఇప్పటికే సన్నద్ధమవుతున్నారు. ప్రతిరోజు వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి, ఆడుతూ పాడుతూ గౌరమ్మను కొలుస్తారు. చివరి రోజు సద్దుల బతుకమ్మతో సంబురాలకు ముగింపు పలుకుతారు.
తొమ్మిది రోజుల బతుకమ్మల వివరాలు
ఈ తొమ్మిది రోజులు బతుకమ్మకు ఒక్కో పేరు ఉంటుంది. రోజువారీ బతుకమ్మల వివరాలు ఇలా ఉన్నాయి.
- సెప్టెంబర్ 21 – ఎంగిలి పూల బతుకమ్మ: మొదటి రోజు బతుకమ్మను ‘ఎంగిలి పూల బతుకమ్మ’ అని పిలుస్తారు. ఈ రోజు తంగేడు, గునుగు పూలతో బతుకమ్మను పేర్చి, పప్పు, బెల్లం కలిపి నైవేద్యంగా పెడతారు.
- సెప్టెంబర్ 22 – అటుకుల బతుకమ్మ: రెండో రోజు గునుగు పూల గుత్తులతో బతుకమ్మను పేర్చి, అటుకులు, బెల్లం కలిపి నైవేద్యం సమర్పిస్తారు.
- సెప్టెంబర్ 23 – ముద్దపప్పు బతుకమ్మ: ఈ రోజు బతుకమ్మను ముద్దపప్పు, బెల్లంతో తయారు చేసిన పిండి వంటలతో కొలుస్తారు.
- సెప్టెంబర్ 24 – నానే బియ్యం బతుకమ్మ: నాలుగో రోజు బతుకమ్మకు నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లంతో తయారు చేసిన పదార్థాలను నైవేద్యంగా పెడతారు.
Also Read: Urea : రైతులకు గుడ్ న్యూస్..రేపు తెలంగాణకు 9,039 మెట్రిక్ టన్నుల యూరియా
- సెప్టెంబర్ 25 – అట్ల బతుకమ్మ: ఐదో రోజు అట్లు, దోసెలు తయారు చేసి బతుకమ్మకు నైవేద్యం పెడతారు.
- సెప్టెంబర్ 26 – అలిగిన బతుకమ్మ: ఆరో రోజు ‘అలిగిన బతుకమ్మ’గా పిలుస్తారు. ఈ రోజు బతుకమ్మను పేర్చకుండా, కేవలం పూలతో గౌరమ్మను మాత్రమే పూజిస్తారు.
- సెప్టెంబర్ 27 – వేపకాయల బతుకమ్మ: ఏడో రోజు వేపకాయలలాగా కనిపించే పూలతో బతుకమ్మను పేర్చి, వేపకాయలలా ఉండే పిండి వంటకాలను నైవేద్యంగా పెడతారు.
- సెప్టెంబర్ 28 – వెన్న ముద్దల బతుకమ్మ: ఎనిమిదో రోజు వెన్న, నువ్వులు, బెల్లంతో తయారు చేసిన ముద్దలను నైవేద్యంగా పెడతారు.
- సెప్టెంబర్ 29 – సద్దుల బతుకమ్మ: బతుకమ్మ పండుగలో అత్యంత ముఖ్యమైన రోజు ఇది. వివిధ రకాల పూలతో పెద్ద బతుకమ్మను పేర్చి, సాయంత్రం ఆటపాటలతో సందడిగా జరుపుకుంటారు. చివరిగా వివిధ రకాల సద్దులు (అన్నం) తయారు చేసి, బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఈ పండుగ తెలంగాణ సంస్కృతి, ప్రకృతి ఆరాధన, ఆడపడుచుల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ తొమ్మిది రోజులు తెలంగాణ పల్లెలు, పట్టణాలు పండుగ శోభతో కళకళలాడతాయి.