Barrelakka – Telangana Elections 2023 : రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన బర్రెలక్క ..ఎవరీ ‘బర్రెలక్క’
ఆమెకు పట్టుమని లక్ష రూపాయలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్‌లేదు. అయినప్పటికీ.. ధైర్యంగా, గెలుపే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగింది
- By Sudheer Published Date - 10:46 AM, Mon - 20 November 23

బర్రెలక్క (Barrelakka Alias Sirisha )ఈ పేరు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా బర్రెలక్క (Barrelakka ) మారింది. ఇంతకీ ఎవరీ బర్రెలక్క..అసలు ఏంటి ఈమె కథ. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై తనదైన శైలిలో అధికార పార్టీ ఫై విమర్శలు గుప్పించి సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయిన బర్రెలక్క(శిరీష) (Shirisha)..ఇప్పుడు తెలంగాణ ఎన్నికల దంగల్ లో బరిలోకి నిలిచింది. ఎన్ని డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని అందుకే బర్లు కాసుకుంటున్నానని తీసిన వీడియో ఈమెను పాపులర్ చేయడమే కాదు..బర్రెలక్క గా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ గుర్తింపే ఇప్పుడు ఎన్నికల్లో నిల్చునేలా చేసింది.
సింహం సింగిల్ గా వస్తున్నట్లు..శిరీష్ సింగిల్ గా బరిలోకి దిగిన ఇప్పుడు యావత్ నియోజకవర్గ ప్రజలు , నిరుద్యోగ యువత ఈమెకు సపోర్ట్ గా నిలుస్తూ ఆమె గెలుపుకు కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు. రోజు రోజుకు ఆమెకు సపోర్ట్ పెరుగుతుండడం తో ఆమె కూడా ఎక్కడ కూడా తగ్గేదేలే అంటూ ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతోంది.
నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ (Kolhapur )నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క(శిరీష) బరిలోకి దిగింది. ఆమెకు పట్టుమని లక్ష రూపాయలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్‌లేదు. అయినప్పటికీ.. ధైర్యంగా, గెలుపే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగింది. ఈమె ధైర్యాన్ని చూసి ప్రతి ఒక్కరు మెచ్చుకుంటూ ఆమెకు సపోర్ట్ పలుకుతున్నారు. సోషల్ మీడియాలో శిరీషకు అనుకూలంగా.. పాటలు, నినాదాలు.. పోటెత్తుతున్నాయి. స్వచ్ఛంద సంస్థలు బ్యానర్లు, ఎన్నికల సామాగ్రిని ఆమెకు అందిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం అంటేనే డబ్బు తో కూడుకున్నది. ప్రతిదీ ఖర్చు చేస్తూ పోవాల్సిందే. కానీ శిరీష్ ప్రచారంలో అన్ని ఖర్చులు వేరే వారే చూసుకుంటున్నారు. టీ ఖర్చుల పేరుతో మరికొందరు రెండు లక్షలు అందించారు. యువత పెద్ద సంఖ్యలో ఆమెకు ఆన్‌లైన్ ప్రచారం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఎవరూ రూపాయి ఆశించకుండా.. బర్రెక్కను గెలిపించాలనే నినాదంతో ప్రచారం చేస్తున్నారు. దీంతో బర్రెలక్క గెలుపు.. కొల్లాపూర్‌కు మలుపు అనే నినాదం వినిపిస్తూ , కనిపిస్తుంది . టీ కొట్లు, టిపెన్ సెంటర్ల దగ్గర బర్రెలక్క పేరు మార్మోగుతోంది. ఆమెను గెలిపించాలని..ఆమె గెలిస్తే మంచి జరుగుతుందని , ఈమె గెలుపు యువత రాజకీయ ఎంట్రీకి మెట్టు అవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోం ది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, రైతు కుటుంబాలు శిరీషకు మద్దతుగా ఉన్నాయని ఆన్‌లైన్ సర్వేలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో శిరీషకు మద్దతుగా యానం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు (Malladi Krishna Rao) బాసటగా నిలిచారు. ఆమె ప్రచారానికి లక్ష రూపాయలు విరాళంగా పంపించారు. శిరీషతో ఫోన్లో మాట్లాడిన మల్లాడి కృష్ణారావు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కొల్లాపూర్ నియోజక వర్గ ఓటరు మహాశయులారా పేద కుటుంబం నుంచి వచ్చిన బర్రెలక్క శిరీషకు ఈ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వండి అని విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి… రాజకీయాల్లో ప్రశ్నించే శిరీష లాంటివాళ్ళు ముందుకు వస్తే మీ భవిష్యత్తు మారుతుంది. మీ గెలుపు నేను కోరుకుంటున్నాను. నీ ప్రచార ఖర్చులకోసం లక్ష రూపాయలు విరాళంగా ఇస్తున్నానని వివరించారు.
మొత్తానికి బర్రెలక్క నామినేషన్ తర్వాత.. మంచి దూకుడుతో దూసుకుపోతుండడంతో ఏమో ఈమె గెలిచినా ఆశ్చర్యం లేదని రాజకీయ వర్గాలు సైతం మాట్లాడుకుంటున్నారు. చూద్దాం ఏంజరుగుతుందో..
Read Also : Liquor Sales : ఎన్నికల టైం.. అయినా లిక్కర్ సేల్స్ డౌన్