Harish Rao: ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదు : హరీశ్ రావు
- Author : Balu J
Date : 14-03-2024 - 11:29 IST
Published By : Hashtagu Telugu Desk
Harish Rao: ఆటో కార్మికులు ఆత్మహత్యల పై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ‘‘ఆటో నడవటం లేదని మనస్తాపంతో, బతుకు భారమై భార్యతో సహా, ప్రాణాలు కోల్పోయిన ఆటో సోదరుడి హృదయ విదారక ఘటన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిలించకపోవడం బాధాకరం. తల్లి, తండ్రిని కోల్పోయి, అనాధగా మారిన ఆ బిడ్డ భవిష్యత్ కు ఎవరు బాధ్యత వహిస్తారు. ఎవరు భరోసా ఇస్తారు. నిజామాబాద్ లో జరిగిన ఈ ఘటన పై ప్రభుత్వం తక్షణం స్పందించి పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి’’ అంటూ డిమాండ్ చేశారు.
‘‘రాష్ట్రంలో వరుసగా ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. నిర్లక్ష్యం వీడి, ప్రభుత్వం వెంటనే ఆటో డైవర్ల జీవన సమస్యకు పరిష్కారం చూపాలి. 12 వేల భృతి ప్రకటించాలి. ఆటో సోదరులు ధైర్యంగా ఉండాలని, తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని కోరుతున్నా’’ అంటూ ఆయన రియాక్ట్ అయ్యారు.
‘‘టెట్ నిర్వహణ జరగకపోవడం వల్ల రాష్ట్రంలో 7 లక్షల పై చిలుకు విద్యార్థులు డీఎస్సీ పరీక్షకు అర్హత కోల్పోతున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ, టెట్ నిర్వహించాలని ఈనెల 12న ప్రభుత్వాన్ని, బిఆర్ఎస్ పార్టీ తరుపున లేఖ ద్వారా డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడం సంతోషకరం. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోగలరని ఆకాంక్షిస్తున్నా’’ అని అన్నారు.