Indiramma Houses : మీరు ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్ !!
Indiramma Houses : తెలంగాణ రాష్ట్రంలో పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యంగా చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి
- By Sudheer Published Date - 01:45 PM, Mon - 27 October 25
తెలంగాణ రాష్ట్రంలో పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యంగా చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపిన ప్రకారం, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిర్ణయాల కారణంగా లబ్ధిదారులకు అందించే బిల్లుల చెల్లింపు విధానంలో స్వల్ప మార్పులు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద 90 పనిదినాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం (IHHL) పనులను ఇళ్ల నిర్మాణంతో అనుసంధానం చేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ మార్పులు తప్పనిసరి అయ్యాయని వివరించారు. అయితే పథకంలోని మొత్తం ఆర్థిక సహాయం అయిన రూ.5 లక్షల చెల్లింపులో ఎలాంటి తగ్గింపు ఉండబోదని స్పష్టంచేశారు.
#ChiruBobby2 : చిరు మూవీ లో సూర్య తమ్ముడు ..?
ప్రస్తుతం అమలులో ఉన్న చెల్లింపు దశల ప్రకారం .. మొదటి దశ పూర్తి చేసినప్పుడు రూ.1 లక్ష, రెండో దశ పూర్తయ్యాక మరో రూ.1 లక్ష విడుదల అవుతున్నాయి. ఈ రెండు దశల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే మూడో దశ చెల్లింపులో ప్రభుత్వం సవరణలు చేసింది. గతంలో మూడో దశ పూర్తి అయితే లబ్ధిదారులకు రూ.2 లక్షలు చెల్లించేవారు. కానీ ఇకపై మూడో దశలో రూ.1.60 లక్షలు మాత్రమే విడుదల చేస్తారు. మిగిలిన రూ.40 వేలును చివరి దశల్లో జమ చేస్తామని మంత్రి తెలిపారు. ఈ చర్య పూర్తిగా పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకున్నదని, లబ్ధిదారులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడం ప్రధాన లక్ష్యం. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు మరియు నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఇళ్లు నిర్మించే వారికి ఈ పథకం ద్వారా 5 లక్షల రూపాయల సాయం దశలవారీగా అందుతుంది. అధికారులు ప్రతి దశను పరిశీలించి నిర్మాణ పురోగతిని ధృవీకరించిన తర్వాతనే నిధులు విడుదల అవుతాయి. గృహరహిత పేదలకు స్వంతింటి కల నెరవేర్చడమే ఈ పథకం ఉద్దేశ్యం అని మంత్రి పొంగులేటి మరోసారి స్పష్టం చేశారు.