Hyderabad : హైదరాబాద్‌లో మరో సొరంగ మార్గం.. ట్రాఫిక్ కష్టాలకు చెక్
చాలా సందర్భాల్లో ఈ ఏరియాల్లో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయలేని స్థితిని ట్రాఫిక్ పోలీసులు(Hyderabad) ఎదుర్కొంటున్నారు.
- By Pasha Published Date - 09:00 AM, Thu - 24 October 24

Hyderabad : హైదరాబాద్ మహానగరం పరిధిలో ప్రతిరోజూ ట్రాఫిక్ ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి గత కొన్నేళ్లలో చాలావరకు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లను నిర్మించారు. అయినా సికింద్రాబాద్ పరిధిలో భారీగా వాహన రద్దీ ఉంటోంది. సికింద్రాబాద్, తాడ్‌బండ్, బోయినపల్లి చౌరస్తాలను దాటే సరికే వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. చాలా సందర్భాల్లో ఈ ఏరియాల్లో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయలేని స్థితిని ట్రాఫిక్ పోలీసులు(Hyderabad) ఎదుర్కొంటున్నారు. ఈ స్థితిని గుర్తించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ).. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్లాన్ రెడీ చేస్తోంది.
Also Read :Venkaiah Naidu Grandson : వెంకయ్య నాయుడి మనవడి పెళ్లిలో సీఎం
సికింద్రాబాద్ – నాగ్‌పూర్ జాతీయ రహదారి వైపు వెళ్లే వాహనదారుల కష్టాలను తీర్చేందుకు సికింద్రాబాద్ జంక్షన్ ప్యారడైజ్ నుంచి తాడ్‌బండ్, బోయినపల్లి జంక్షన్ల మీదుగా డెయిరీ ఫాం వరకు ఎలివేటెడ్ కారిడార్‌ను హెచ్ఎండీఏ నిర్మించనుంది. దీనికోసం ప్రైవేటు ఆస్తుల సేకరణ ప్రక్రియ సైతం మొదలైంది. దీనిలో భాగంగానే బోయినపల్లి చౌరస్తా నుంచి బలంరాయి రోడ్‌ను అనుసంధానం చేస్తూ బేగంపేట ఎయిర్‌పోర్టు సమీపంలో సొరంగ మార్గాన్ని నిర్మించాలని హెచ్‌ఎండీఏ యోచిస్తోంది. అయితే ఇందుకోసం ఎయిర్‌పోర్టు అథారిటీ అనుమతులు తప్పనిసరి. దీంతో సొరంగ మార్గం నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వాలంటూ ఎయిర్‌పోర్టు అథారిటీకి హెచ్‌ఎండీఏ అధికారులు ప్రతిపాదనలు పంపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో రక్షణశాఖ అనుమతులతో కొన్ని ఆస్తులను సేకరించాల్సి ఉందని సమాచారం. త్వరలోనే ఈ రెండు అనుమతులను కూడా హెచ్ఎండీఏ పొందేే ఛాన్స్ ఉంది. ఆ తర్వాతే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులకు టెండర్లను పిలిచే అవకాశం ఉంది. ఎలివేటెడ్ కారిడార్ మొత్తం విస్తీర్ణం 5.32 కి.మీ. దీని అంచనా వ్యయం రూ. 1580 కోట్లు అని అంచనా. సొరంగ మార్గం దాదాపు 0.6 కి.మీ విస్తీర్ణంలో ఉంటుంది.