Fire Accident: హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో మరో భారీ అగ్నిప్రమాదం
వరుస అగ్ని ప్రమాదాలు హైదరాబాద్ వాసులను ఆందోళన కలిగిస్తున్నాయి. డెక్కన్ మాల్, స్వప్నలోక్ కాంప్లెక్స్ ల్లో ప్రమాదాలు పలువురిని పొట్టనపెట్టుకున్నాయి.
- Author : Maheswara Rao Nadella
Date : 18-03-2023 - 11:38 IST
Published By : Hashtagu Telugu Desk
వరుస అగ్ని ప్రమాదాలు (Fire Accident) హైదరాబాద్ వాసులను ఆందోళన కలిగిస్తున్నాయి. డెక్కన్ మాల్, స్వప్నలోక్ కాంప్లెక్స్ ల్లో ప్రమాదాలు పలువురిని పొట్టనపెట్టుకున్నాయి. తాజాగా రాజేంద్రనగర్ శాస్త్రీపూరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్లాస్టిక్ గోదాంలో జరిగిన అగ్గి రాజుకొని పెద్ద ఎత్తున్న మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలకు గోదాంలోని రెండు డీసీఎం వాహనాలు దగ్ధం అయ్యాయి. ప్లాస్టిక్ కాలిన ఘాటైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. గోదాం పక్కనే ఉన్న పాఠశాలను అధికారులు త్వరితగతిన ఖాళీ చేయించారు.
పాఠశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష సెంటర్ ఉండటంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో అగ్నిప్రమాదం (Fire Accident) జరిగిందని తెలుస్తోంది. కానీ, జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాల గోదాంలను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
Also Read: She Shuttle Bus: హైదరాబాద్ లో మొదలైన షీ షటిల్ బస్సు సర్వీస్.. మహిళలకు ఉచిత ప్రయాణం