Davos : తెలంగాణలో అమెజాన్ రూ.60వేల కోట్ల పెట్టుబడులు
Davos : అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులు సమావేశమయ్యారు
- By Sudheer Published Date - 03:18 PM, Thu - 23 January 25

దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ప్రపంచంలోనే పేరు గాంచిన సంస్థల ప్రతినిధులను ఒప్పిస్తూ తన మార్క్ కనపరుస్తున్నారు. తాజాగా మరో సంస్థతో ఏకంగా రూ. 60 వేల కోట్ల పెట్టుబడులను సాధించారు. హైదరాబాద్ లో ఏకంగా రూ.60,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ సంస్థ(Amazon to invest Rs 60,000 Cr in Hyderabad) ముందుకొచ్చింది. డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ఒప్పందం చేసుకుంది.
Telangana Record In Davos: దావోస్‌లో తెలంగాణ సరికొత్త రికార్డు.. 46 వేల మందికి జాబ్స్!
అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులు సమావేశమయ్యారు. డేటా సెంటర్ల విస్తరణకు అవసరమైన మౌలిక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని కేటాయించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా 2030 నాటికి అమెజాన్ 4.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో హైదరాబాద్‌ను డేటా సెంటర్లకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే మూడు డేటా సెంటర్లను ప్రారంభించిన అమెజాన్, తాజా ఒప్పందంతో మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ముఖ్యమంత్రి ఈ ఒప్పందం గురించి మాట్లాడుతూ.. ఈ పెట్టుబడులు తెలంగాణ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తాయని, ఇది ప్రజా ప్రభుత్వ విజయాన్ని ప్రతిబింబిస్తుందని హర్షం వ్యక్తం చేశారు.
అలాగే ఇన్ఫోసిస్ సంస్థ కూడా హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున విస్తరణ కార్యక్రమాలను ప్రకటించింది. పోచారంలో ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో అదనంగా 17,000 ఉద్యోగాలు కల్పించేందుకు సంస్థ ప్రణాళిక రూపొందించింది. ప్రథమ దశలో రూ.750 కోట్ల పెట్టుబడితో ఐటీ భవనాల నిర్మాణం చేపట్టనుంది. ఇలా పెద్ద ఎత్తున భారీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుండడం పట్ల రాష్ట్ర ప్రజలు , ముఖ్యంగా నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.