Rain Alert: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు
- Author : Vamsi Chowdary Korata
Date : 18-07-2026 - 10:56 IST
Published By : Hashtagu Telugu Desk
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాగల 24 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా, రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోనూ వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలోని విజయనгరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఉభయ గోదావరి (తూర్పు, పశ్చిమ గోదావరి), కృష్ణా, ఎన్టీఆర్, మరియు గుంటూరు జిల్లాల్లో బలమైన ఈదురు గాలులతో పాటు పిడుగులు పడే తీవ్ర ముప్పు ఉందని IMD పేర్కొంది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు, ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు మరియు పశువుల కాపరులు చెట్ల కింద ఉండకూడదని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల తీర ప్రాంతాల్లో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.