Adilabad Tribals : ఫలించిన ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల పోరాటం
Adilabad Tribals : జీవో 49 ప్రకారం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 3 లక్షల ఎకరాల అటవీ భూమిని కొమ్రంభీమ్ కన్జర్వేషన్ కారిడార్‌గా మార్చే యోచనతో ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ నిర్ణయం ఆదివాసీలకు వారి సాంప్రదాయ జీవన ప్రాంతాలను కోల్పోయే ప్రమాదాన్ని తెచ్చిపెట్టేది
- By Sudheer Published Date - 08:15 PM, Mon - 21 July 25

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు (Adilabad Tribals) చేపట్టిన పోరాటం ఫలితాన్నిచ్చింది. గిరిజనుల భూములను కోల్పోతామన్న భయంతో వారు దీర్ఘకాలంగా వ్యతిరేకిస్తున్న జీవో నంబర్ 49ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించడంతో, గిరిజన ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివాసీ నాయకులు, ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ముఖ్యమంత్రికి మరియు గిరిజన హక్కుల కోసం పోరాడిన నేత సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.
జీవో 49 ప్రకారం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 3 లక్షల ఎకరాల అటవీ భూమిని కొమ్రంభీమ్ కన్జర్వేషన్ కారిడార్‌గా మార్చే యోచనతో ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ నిర్ణయం ఆదివాసీలకు వారి సాంప్రదాయ జీవన ప్రాంతాలను కోల్పోయే ప్రమాదాన్ని తెచ్చిపెట్టేది. గిరిజనులు తమ భూములను సంప్రదాయ పద్ధతిలో సాగుచేస్తూ జీవనం సాగిస్తుండటంతో, ఈ జీవోపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగారు.
Free Bus : ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్ – రూల్స్ చూసుకోండి
ఇతర నాయకులను కలిసి తన గోడును చెప్పినా ప్రయోజనం లేకపోయింది. రోడ్లపై రిలే దీక్షలు, నిరసన ర్యాలీలు నిర్వహిస్తూ, ప్రజల దృష్టిని ఆకర్షించారు. చివరకు జీవో రద్దు కోసం సోమవారం ఉమ్మడి జిల్లాలో బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు వ్యాపారవేత్తలు, రవాణా శాఖ, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడం విశేషం. ఉద్యమం పూర్తి శాంతియుతంగా జరగడంతో ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది.
ముఖ్యమంత్రి జీవో 49ను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో గిరిజనుల ఆందోళన తాత్కాలికంగా తగ్గింది. అయితే వారు ఈ జీవోను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిలిపివేత కంటే రద్దు అయితేనే భవిష్యత్తులో గిరిజనులకు భూసంరక్షణపై నమ్మకాన్ని కలిగించగలదని వారు అంటున్నారు. నిలిపివేసిన జీవోను ఎప్పుడైనా తిరిగి అమలు చేసే అవకాశం ఉందన్న అనుమానాలు గిరిజనుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇకపై ప్రభుత్వం వారి డిమాండ్లను ఎంతవరకు పట్టించుకుంటుందన్నది వేచి చూడాల్సిన అంశం.