Hydraa : 750 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా
Hydraa : హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు, భూ కబ్జాలు, చెరువుల ఆక్రమణలపై నిశితంగా నిఘా పెట్టిన హైడ్రా బృందం మరోసారి తన కర్తవ్యనిష్ఠను చాటుకుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని షేక్‌పేట మండల పరిధిలో ఉన్న సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు
- By Sudheer Published Date - 11:50 AM, Fri - 10 October 25

హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు, భూ కబ్జాలు, చెరువుల ఆక్రమణలపై నిశితంగా నిఘా పెట్టిన హైడ్రా బృందం మరోసారి తన కర్తవ్యనిష్ఠను చాటుకుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని షేక్‌పేట మండల పరిధిలో ఉన్న సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి విలువ దాదాపు రూ.750 కోట్లుగా అంచనా వేయబడింది. ఇటీవల వరకు అక్రమ నిర్మాణాల తొలగింపుపై దృష్టి పెట్టిన హైడ్రా, ఇప్పుడు భూ కబ్జాలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ భూముల కాపాడటంతో పాటు చెరువుల పునరుద్ధరణలోనూ హైడ్రా చురుకైన పాత్ర పోషిస్తోంది.
Intestinal Worms: కడుపులో నులిపురుగుల సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!
ఈ కేసులో పార్థసారథి అనే వ్యక్తి ప్రభుత్వానికి కేటాయించిన 1.20 ఎకరాల భూమితో పాటు మొత్తం 5 ఎకరాలు తనదంటూ తప్పుడు పత్రాలు చూపిస్తూ ఆక్రమణలకు పాల్పడ్డాడు. కోర్టులో వివాదం నడుస్తున్నప్పటికీ, అతడు ఆ ప్రాంతంలో ఫెన్సింగ్ వేసి బౌన్సర్లను, వేటకుక్కలను కాపలాగా పెట్టి పూర్తి నియంత్రణను సాధించుకున్నాడు. అంతేకాకుండా ప్రభుత్వ భూమిలో తాత్కాలిక షెడ్డులు నిర్మించి, అక్కడే మద్యం సేవిస్తూ పరిసర ప్రాంత ప్రజలకు భయభ్రాంతులను కలిగించాడు. జలమండలి తాగునీటి రిజర్వాయర్ నిర్మించాలన్న యత్నాలను కూడా అడ్డగించాడు. ఈ పరిణామాలపై జలమండలి, రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో, హైడ్రా అధికారులు తక్షణ చర్యలు చేపట్టి అక్రమార్కులను తరిమేశారు.
వివరణాత్మక పరిశీలనలో హైడ్రా బృందం పార్థసారథి తప్పుడు సర్వే నంబర్ (403/52) సృష్టించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించింది. ఆన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఆధారంగా తనదని చూపిస్తూ అక్రమ క్లెయిమ్ చేశాడు. ఈ నేపథ్యంలో షేక్‌పేట రెవెన్యూ అధికారుల లేఖ ఆధారంగా భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా ఆక్రమణలను తొలగించింది. ఫెన్సింగ్, షెడ్డులు మొత్తం తొలగించి, భూమిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించింది. చివరగా, ఆ ప్రాంతం చుట్టూ కొత్త ఫెన్సింగ్ వేసి “ప్రభుత్వ భూమి – హైడ్రా సంరక్షణలో” అనే బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ చర్యతో ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో హైడ్రా మరోసారి ప్రజల ప్రశంసలు అందుకుంది.