Jubilee Hills Rape Case: జువెనైల్ జస్టిస్ బోర్డు సంచలన తీర్పు.. నలుగురు నిందితులు మేజర్లు..!
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసులో శుక్రవారం కీలక తీర్పు వెలువడింది.
- By Hashtag U Published Date - 07:19 PM, Fri - 30 September 22

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసులో శుక్రవారం కీలక తీర్పు వెలువడింది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు మైనర్ నిందితుల్లో నలుగురిని మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డు నిర్ణయించింది. నేరం జరిగినప్పుడు నిందితుల వయస్సు 16 నుంచి 18 ఏళ్ల మధ్య ఉంటుందని కోర్టు పేర్కొంది. ఈ ఐదుగురు మైనర్లలో బహదూర్‌పురా ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడు. కానీ నలుగురు మైనర్లను మేజర్లుగా గుర్తించిన బోర్డు ఎమ్మెల్యే కొడుకును మైనర్‌గా ప్రకటించింది.
ఈ కేసుకు సంబంధించి ఇటీవల హైదరాబాద్ పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గ్యాంగ్ రేప్ నిందితులను మేజర్లుగా గుర్తించాలని పోలీసులు బోర్డును కోరారు. పోలీసుల పిటిషన్‌పై విచారణ ముగించి జువైనల్ జస్టిస్ బోర్డు శుక్రవారం తీర్పు వెలువరించింది.
అత్యాచారానికి పాల్పడిన నలుగురు మైనర్లను మేజర్లుగా గుర్తించి కోర్టులో విచారణ ప్రారంభించాలని బోర్డు పోలీసులను ఆదేశించింది. మైనర్ అయిన ఎమ్మెల్యే కుమారుడిని జువైనల్‌గా విచారించవచ్చని పేర్కొంది. అయితే నేరం జరిగిన సమయంలో తాము మద్యం సేవించలేదని పేర్కొన్నారు. కేసును నాంపల్లి పిల్లల కోర్టుకు బదిలీ చేశారు. నలుగురు నిందితులకు మద్య వ్యసనం లేదని మానసిక వైద్యుల నివేదికతో జువైనల్ జస్టిస్ బోర్డు ఏకీభవించింది.