Telangana Border : బార్డర్‌లో 3వేల కృష్ణ జింకలు.. ఎలా పట్టుకోబోతున్నారంటే ?
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడువేల పైచిలుకు కృష్ణ జింకలను త్వరలోనే పట్టుకోనున్నారు.
- By Pasha Published Date - 09:16 AM, Sun - 7 July 24

Telangana Border : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడువేల పైచిలుకు కృష్ణ జింకలను త్వరలోనే పట్టుకోనున్నారు. తెలంగాణ – కర్ణాటక బార్డర్‌లోని మాగనూరు, కృష్ణా, మక్తల్, ఊట్కూరు, నర్వ, దేవరకద్ర మండలాల పరిధిలోని కృష్ణా నదీ తీరంలో ఈ కృష్ణ జింకల పట్టివేతకు రంగం సిద్ధమవుతోంది. ఇంతకీ ఎందుకు అనేది తెలియాలంటే వార్త మొత్తం చదవండి..
We’re now on WhatsApp. Click to Join
కృష్ణ జింకలు మిగతా వన్యప్రాణుల్లా పూర్తిగా అడవుల్లో ఉండవు. గడ్డిభూములు, పంటపొలాలు, నీటి వసతి ఉన్న నదీ పరివాహక ప్రాంతాల్లో అవి తిరుగుతుంటాయి. వాటి సమీపంలోని పంటలపై ఆధారపడతాయి. ఈక్రమంలోనే తెలంగాణ, కర్ణాటక బార్డర్‌లోని కృష్ణా నదీ తీర మండలాల్లో ఉన్న పంట పొలాల్లో కృష్ణ జింకలు హల్‌చల్ చేస్తుంటాయి. దీంతో తీవ్ర పంట నష్టం జరుగుతోంది. పంట సీజన్‌లో తమకు ఈ జింకలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఆయా మండలాల రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై గతంలో వారు పలుమార్లు నిరసనలు కూడా తెలిపారు.
74 ఎకరాల్లో కృష్ణ జింకల సంరక్షణ కేంద్రం
ఈనేపథ్యంలో కృష్ణ జింకలతో(Black Deers) పంటలకు కలుగుతున్న నష్టంపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Border) అధ్యయనం చేయించింది. వాటి కారణంగా భారీగా పంట నష్టం పెద్దఎత్తున జరుగుతోందని ఈ స్టడీలో తేలింది. మాగనూరు, కృష్ణా, మక్తల్, ఊట్కూరు, నర్వ, దేవరకద్ర మండలాల పరిధిలోని కృష్ణా నదీ తీరంలో తిరుగుతున్న దాదాపు 3వేల పైచిలుకు కృష్ణ జింకలను బంధించి.. వాటి కోసం మరో చోట సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని నిపుణుల టీమ్ సిఫారసు చేసింది. ఇందులో భాగంగా నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్‌లో 74 ఎకరాల్లో కృష్ణ జింకల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. దీని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.70 కోట్లు మంజూరు చేసింది. కృష్ణ జింకల సంరక్షణ కేంద్రం చుట్టూ 8 అడుగుల ఎత్తుతో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. త్వరలో ఆ కేంద్రం పనులు మొదలవుతాయి. దాదాపు 3వేల కృష్ణ జింకలను పట్టి ఈ పునరావాస కేంద్రంలో కొన్నాళ్లు ఉంచుతారు. తర్వాత దశలవారీగా వాటిని ప్రాణహిత తీరం, నాగార్జునసాగర్, నల్లమల అడవుల్లోని మద్దిమడుగు ప్రాంతాల్లో విడిచిపెడతారు.
Also Read :Ashadha Masam : ఆషాఢ మాసంలోని పర్వదినాల గురించి తెలుసా ?
పట్టివేత ఇలా..
బోమా పద్ధతిలో కృష్ణ జింకలను పట్టేందుకు ప్రణాళికలను రెడీ చేశారు. మాగనూరు, కృష్ణా, మక్తల్, ఊట్కూరు, నర్వ, దేవరకద్ర మండలాల పరిధిలోని గ్రామాల్లో ‘వి’ అకారంలో 50-80 మీటర్ల పొడవుతో ఫెన్సింగ్ లింక్ ఏర్పాటు చేస్తారు. దీని లోపలికి జింకలు వెళ్లే కొద్ది వెడల్పు తగ్గుతుంది. చివరిభాగం నుంచి వాటిని ఎన్‌క్లోజర్‌లో బంధించి ముడుమాల్‌లోని సంరక్షణ కేంద్రానికి తరలిస్తారు.