Medigadda Barrage Bridge : కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ బ్రిడ్జి.. అలర్ట్ ప్రకటించిన ఇంజినీర్లు
Medigadda Barrage Bridge : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ బ్రిడ్జి కొన్ని పిల్లర్ల వద్ద కుంగిపోయింది
- Author : Pasha
Date : 22-10-2023 - 7:50 IST
Published By : Hashtagu Telugu Desk
Medigadda Barrage Bridge : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ బ్రిడ్జి కొన్ని పిల్లర్ల వద్ద కుంగిపోయింది. బ్యారేజీ బ్రిడ్జి బీ-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య బ్రిడ్జి ఒక అడుగు మేర కుంగిందని గుర్తించారు. బ్యారేజీలోని 20వ పిల్లర్ కుంగడం వల్లే ఇలా జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై లక్ష్మీ బ్యారేజీ బ్రిడ్జిని 2019లో నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటిది. ఈ బ్యారేజీ 1.6 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అయితే ఈ బ్రిడ్జి కుంగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల దూరంలో ఉంది. దీన్ని గుర్తించిన ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు డ్యాం పరిసరాల్లో అలర్ట్‌ను ప్రకటించారు. మహారాష్ట్ర- తెలంగాణ మధ్య ఈ బ్యారేజీ పైనుంచి రాకపోకలను తాత్కాలికంగా ఆపేశారు. డ్యాం ఇంజినీర్లు మహారాష్ట్ర వైపు సిరోంచ, తెలంగాణ వైపు మహదేవపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెండు వైపుల నుంచి పోలీసులను కాపలాగా పెట్టారు. బ్రిడ్జిని నిర్మించిన కాంట్రాక్ట్ సంస్థ ఎల్‌అండ్‌టీకి చెందిన నిపుణులు శనివారం అర్ధరాత్రే మేడిగడ్డకు చేరుకున్నారు. డ్యాం పైభాగాన్ని పరిశీలించారు. పిల్లర్లు కుంగటానికి కారణాలేంటి అనేది ఇవాళ తెలిసే ఛాన్స్ ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
శనివారం రాత్రి సమయానికి ఎగువ ప్రాంతం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులోకి 25 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. అధికారులు 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. మొదట 12 గేట్లు, తరువాత వాటిని 46కు పెంచి దిగువకు నీటిని విడుదల చేశారు. దాదాపు 50వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ఈ బ్యారేజీ మెుత్తం సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా.. పలు పిల్లర్లు కుంగిన సమయానికి బ్యారేజీలో 10.17 టీఎంసీల నీరు నిల్వ(Medigadda Barrage Bridge) ఉంది.