Heart Attack : కార్తీక పౌర్ణమి వేళ ..ఆగిన 12 ఏళ్ల చిన్నారి గుండె
Heart Attack : అప్పటివరకు ఆడుతూపాడుతూ సరదాగా కళ్లముందు ఉన్న పసిపాప..అంతలోనే తిరిగిరాని లోకానికి చేరుకొని ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది
- By Sudheer Published Date - 10:43 PM, Fri - 15 November 24

కార్తీక పౌర్ణమి (Karthika Pournami) వేళ అందరి ఇళ్లలో దీపాలు వెలుగుతున్న వేళా..ఓ ఇంట్లో మాత్రం ఓ చిన్నారి దీపం ఆరిపోయింది. అప్పటివరకు ఆడుతూపాడుతూ సరదాగా కళ్లముందు ఉన్న పసిపాప..అంతలోనే తిరిగిరాని లోకానికి చేరుకొని ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది. ఈ మధ్య గుండెపోటులు మరణాలు అనేవి అనేకమయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా వస్తూ..ప్రాణాలు తీస్తున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ మరణాల సంఖ్య ఎక్కువైపోతోంది. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట గుండెపోటు మరణం అనే వార్త వెలుగులోకి వస్తుంది. తాజాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో అదే జరిగింది.
పట్టణంలోని పద్మానగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్- రమ దంపతులకు కూతురు నివృత్తితో పాటు ఓ కుమారుడు ఉన్నాడు. నివృత్తి పెద్దది. చెన్నూర్ పట్టణంలోని స్థానిక పాఠశాలలో నివృత్తి ఏడో తరగతి చదువుతోంది. ఈరోజు (నవంబర్ 15న) కార్తీక పౌర్ణమి కావడంతో పాఠశాలకు సెలవు ఇచ్చారు. దీంతో.. ఆ చిన్నారి ఇంట్లోనే సరదాగా ఆడుకుంటూ గడిపింది. సడెన్ గా ఏం జరిగిందో తెలియదు.. ఆడుకుంటూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే తల్లిదండ్రులు ఆమెను లేపేందుకు ట్రై చేయగా.. ఫలితం కనిపించలేదు. దీంతో.. హుటాహుటిన నివృత్తిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ.. అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. చిన్నారిని పరీక్షించిన వైద్యులు నివృత్తి అప్పటికే మృతి చెందినట్లుగా ప్రకటించారు. గుండెపోటు కారణంగానే ఆ చిన్నారి ప్రాణాలు వదిలినట్టు చెప్పడం తో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె..కళ్ల ముందే విగతజీవిగా మారటాన్ని జీర్ణించుకోలేకపోయారు. 12 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ ఘటన ఆ కాలనీ లో విషాదాన్ని నింపింది.
Read Also : Maharashtra Election Campaign : మహారాష్ట్రలో ఇద్దరు తెలుగు సీఎంల ప్రచారం..ఇక తగ్గేదేలే