కేటీఆర్ ర్యాలీలో వైసీపీ జెండాలు..
- Author : Vamsi Chowdary Korata
Date : 07-01-2026 - 2:49 IST
Published By : Hashtagu Telugu Desk
KTR khammam Tour ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆయన ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటోలు, వైసీపీ జెండాలు కనిపించడం ఆసక్తికరంగా మారింది. ర్యాలీలో పాల్గొన్న క కార్యకర్తలు ‘జై జగన్.. జై కేటీఆర్’ అంటూ నినాదాలు చేశారు. ఇటీవల జగన్ పుట్టినరోజు వేడుకల్లో కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు కనిపించడంతో రెండు పార్టీల సాన్నిహిత్యం మరోసారి చర్చనీయాంశమైంది.
- కేటీఆర్ ఖమ్మం పర్యటనలో ఆసక్తికర సీన్
- జైజగన్ నినాదాలు.. వైసీపీ జెండాలు
- చర్చనీయాంశంగా మారిన సీన్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ పర్యటనలో ‘జై జగన్’ అంటూ నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ బుధవారం నాడు… ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం, నాయకన్‌గూడెంలో ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఫొటోతో పాటు వైసీపీ (YSRCP) జెండాలు దర్శనం ఇవ్వడం కలకలం రేపింది.
కేటీఆర్ ర్యాలీలో వైసీపీ పార్టీ కార్యకర్తలు, వైఎస్ జగన్ అభిమానులు పాల్గొన్నారు. వారంతా వైసీపీ జెండాలు చేతబట్టి… ‘జై జగన్… జై కేటీఆర్’ అంటూ నినాదాలు చేశారు. ఈ వార్త ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే ఖమ్మం పర్యటనలో భాగంగా… నాయకన్‌గూడెం గ్రామానికి చేరుకున్న కేటీఆర్‌కు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆ గ్రామంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఉన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు… నాయకన్‌గూడెం నుంచి ఖమ్మం వరకు బైక్‌ల మీద ర్యాలీ నిర్వహించారు.
అనంతరం తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున విజయం సాధించిన సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులను కలిసి వారిని అభినందిస్తారు. ఇదిలా ఉంటే మంగళవారం కేటీఆర్ జనగామా జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ జిల్లాలో బీఆర్ఎస్ తరఫున స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిన వారిని కేటీఆర్ అభినందించారు.
అయితే ఇటీవల జగన్ పుట్టిన రోజు సందర్బంగా… గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం వద్ద కేసీఆర్, కేటీఆర్, జగన్ ఫొటోలు ఉన్న భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుతం విపక్ష పార్టీల మధ్య ఉన్న సాన్నిహిత్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది.