WhatsApp: వాట్సాప్ లో మరో 4 అద్భుతమైన ఫీచర్స్.. అవేంటో తెలుసా?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ సంస్థ ఇప్పుడు వినియోగదారుల కోసం మరో నాలుగు అద్భుతమైన ఫీచర్లను తీసుకువచ్చింది.
- By Anshu Published Date - 11:04 AM, Fri - 17 January 25

ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నిత్యం కోట్ల మంది వినియోగిస్తున్న సోషల్ మీడియా యాప్స్ లో వాట్సాప్ కూడా ఒకటి. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు వాట్సాప్ లోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. రోజు రోజుకీ ఈ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. అయితే వినియోగదారుల సంఖ్యను మరింత పెంచుకోవడం కోసం వాట్సాప్ సంస్థ ఇప్పటికీ ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. వాటితో పాటుగా ఇప్పుడు మరికొన్ని సరికొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్ సంస్థ. ఆ ఫీచర్లు ఏంటి అన్న విషయానికి వస్తే..
వాట్సాప్ గత సంవత్సరం వీడియో కాల్‌ల కోసం కెమెరా ఎఫెక్ట్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. అయితే వినియోగదారులు ఇప్పుడు దీన్ని ఫోటోలు, వీడియోలలో కూడా ఉపయోగించవచ్చట. ఈ ప్రత్యేక ఫీచర్ తో వినియోగదారులు దాదాపు 30 రకాల బ్యాక్ గ్రౌండ్ లను మార్చుకోవచ్చట. సంభాషణలు ఆసక్తికరంగా ఉండేలా వాట్సాప్ దీన్ని ప్రవేశపెట్టింది.
అలాగే వాట్సాప్ ఈ కొత్త సెల్ఫీ స్టిక్కర్ల ఫీచర్‌తో, వినియోగదారులు తమ సెల్ఫీ ఫోటోలను సులభంగా స్టిక్కర్ లుగా మార్చుకోవచ్చట. దీని కోసం మీరు స్టిక్కర్ సైట్ లోని క్రియేట్ పై క్లిక్ చేసి, ఇప్పటికే తీసిన ఫోటోను అప్‌లోడ్ చేయాలి. దీని తర్వాత ఫోటో ఆటోమేటిక్ గా స్టిక్కర్ గా మారుతుంది.
అదేవిధంగా వాట్సాప్ తన వినియోగదారులను స్టిక్కర్లను మార్పిడి చేసుకోవడానికి అనుమతిస్తుంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఫీచర్‌ని ఉపయోగించి వినియోగదారులు తమ కాంటాక్ట్ లిస్ట్ లోని ఎవరికైనా బల్క్ స్టిక్కర్ లను పంపవచ్చు. ఇంతక ముందు వ్యక్తిగతంగా స్టిక్కర్లను మాత్రమే పంపే సదుపాయం ఉండగా, ఇప్పుడు బల్క్‌గా పంపే సౌకర్యం ఉంది.
అలాగే వాట్సాప్ క్వికర్ రియాక్షన్ ఫీచర్‌ని ప్రవేశ పెట్టింది. కొద్ది రోజుల క్రితం తీసుకువచ్చిన రియాక్ట్ ఫీచర్ కి ఇది కొనసాగింపు అని చెప్పాలి. అంటే ముందుగా టెక్స్ట్ మెసేజ్ ని ప్రెస్ చేసి, ఆ తర్వాత రియాక్ట్ అవ్వాలి. కానీ మీరు ఇన్‌స్టాగ్రామ్ లో చేసినట్లుగా రెండు సార్లు నొక్కడం ద్వారా మీరు స్పందించవచ్చట.